చెన్నై, జనవరి 31: రాజకీయ రంగంలో తనను కింగ్ మేకర్‌గా ముద్ర వేయడం ఇష్టం లేదని, నేరుగా ఎన్నికల్లో గెలిచి కింగ్‌నే అవుతానని తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు ‘నేను ఎన్నికల్లో విజయం సాధిస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్‌గా ఎందుకుండాలి. నా సభలకు వస్తున్న ప్రజా సమూహాలను చూశారా?’ అని ఆయన పేర్కొన్నారు.
ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం ఒక్క ఎన్నికలకే పరిమితం కాదని, తన ప్రస్థానం దీర్ఘకాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా స్టార్ నటుడిగా ఉన్న తాను ఇప్పుడు రాజకీయాలపై దృష్టి సారించానని, ఇలా మార్పు చెందడం అంత సులభమేమీ కాదని అన్నారు. తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తనను షాక్‌కు గురి చేసిందని, అది పీడ కలలా తనను వెంటాడుతున్నదని విజయ్ తెలిపారు. తన ‘జన నాయగన్’ చిత్రం విడుదల కాకపోవడానికి కారణం తాను రాజకీయాల్లో ఉండటమేనన్నారు. తమ పార్టీకి విజిల్ గుర్తును కేటాయించడం తమ తొలి విజయంగా పేర్కొన్నారు.