TVK Vijay : తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ (Actor Vijay) స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (TVK)’ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ అధినేత విజయ్ స్వయంగా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు.
విజయ్ తన పూర్తి పేరు ‘సి. జోసెఫ్ విజయ్’ పేరుతో నామినేషన్ వేయనున్నారు. చెన్నైలోని పెరంబూర్ మధ్య తమిళనాడులో పట్టుకోసం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయనున్నారు. తమ అభ్యర్థులను ‘మక్కల్ కాప్పాలర్గల్’ గా అభివర్ణించిన విజయ్ వారు రాజకీయ నాయకులు కాదని, ప్రజల్లో ఒకరని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు తమ పార్టీకి, డీఎంకే కూటమికి మధ్యే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ చెన్నైలోని టీ నగర్ నుంచి ప్రచార విభాగం నేత ఆదవ్ అర్జున విల్లివాక్కం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి కేఏ సెంగోట్టయన్ గోబిచెట్టిపాళయం నుంచి బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా విజయ్ పలు కీలక హామీలను ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, 29 ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సాయం, ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకతకు ప్రత్యేక చట్టం, విద్యార్థులకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మార్చి 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా విజయ్ నిర్ణయంతో డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల్లో రాజకీయ వేడి పెరిగింది.