Jahangir Khan : పశ్చిమబెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేత జహంగీర్ ఖాన్ (Jahangeer Khan) కు పరాభవం ఎదురైంది. వసూళ్లు సహా పలు ఇతర ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయనను పోలీసులు నడుముకు తాడు కట్టి, మోకాలివరకు నిక్కరుతో వీధుల్లో ఊరేగించారు. ఈ నెలలో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన్ను ఇలా బహిరంగంగా ఊరేగించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.
‘ఫల్టా పుష్ప’ గా స్థానికంగా పేరు పొందిన జహంగీర్ ఖాన్.. ఈ వీడియోలో చెప్పుల్లేని కాళ్లతో, నడుముకు తాడు కట్టించుకుని, చేతులు జోడించి ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్టుగా నడుస్తూ కనిపించారు. భారీ భద్రత నడుమ పోలీసులు ఆయన్ను వీధుల్లో తిప్పారు. వసూళ్ల ఆరోపణలపై ఈ నెల 8న అరెస్టయిన జహంగీర్ ఖాన్‌ను బెంగాల్‌లోని ఓ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. నార్త్ బెంగాల్‌లోని పానిటంకి ప్రాంతంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఫల్టా అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
మే 21న ఈ నియోజకవర్గంలో రీపోలింగ్ జరగడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆయన కనిపించకుండా పోయారు. జహంగీర్ ఖాన్‌పై ఫల్టా పోలీస్ స్టేషన్లో ఏకంగా ఏడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. రీపోలింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా కలకత్తా హైకోర్టు మే 18న ఆయనకు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించింది. అయితే కోర్టు రక్షణ కల్పించిన మరుసటి రోజే అనూహ్యంగా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మే 26న హైకోర్టు ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేసింది. దాంతో పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టి అరెస్ట్ చేశారు.