అసలే చలికాలం. పొగమంచు కమ్ముకున్న పొద్దున.. బద్దకంగా నిద్రలేచి, కండ్లు నులుముకుంటూ ఇంటి బయటకు వచ్చిచూస్తే.. పిట్టగోడ మీద పెద్ద పులి! అడుగుల దూరంలోనే నోరు తెరిచి ఎదురుపడితే ఏమనిపిస్తుంది? గుండెజారి గుప్పిట్లోకి వచ్చేస్తుంది కదూ!
యూపీలోని పిలిభిత్ జిల్లా అట్కోనా గ్రామస్థులకు ఇలాంటి ఒళ్లు జలదరించే అనుభవమే ఎదురైంది. అటవీప్రాంతం నుంచి రాత్రివేళ వచ్చిన ఓ పులి అక్కడి గురుద్వారా గోడపైనే నిద్రపోయింది. పొద్దున్నే ఒళ్లు విరుచుకుంటూ కనిపించడంతో గ్రామస్థులంతా హడలిపోయారు. గంటలు గడిచినా, వందలమంది వచ్చినా అది గోడపై నుంచి కదల్లేదు. శీతగాలుల మధ్య లేత ఎండకు మురిసిపోతున్నట్టు అక్కడే ఉండిపోయింది. చివరకు అటవీ అధికారులు పులిని వలలతో బంధించి, అక్కడినుంచి తరలించారు.