ఐటీ రంగ అభివృద్ధిలో హైదరాబాగ్ నగరం బెంగళూరును మించిపోనున్నది. గత పదేండ్లుగా కర్ణాటక ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యం ఫలితమిది. అదే సమయంలో హైదరాబాద్‌లో ఐటీ గణనీయమైన వృద్ధిని సాధించింది.
– పాయ్
బెంగళూరు/హైదరాబాద్, నవంబర్ 29: ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు. భారత సిలికాన్ వ్యాలీగా ఆ నగరం పేరుపొందింది. కానీ ఇప్పుడు ఐటీ అడ్డాగా హైదరాబాద్ నిలుస్తున్నది. గత తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగంలో హైదరాబాద్ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. జాతీయ, అంతర్జాతీయ ఐటీ రంగ నిపుణులు ఇదే విషయాన్ని స్పష్టంచేస్తున్నారు. ఐటీ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ బుధవారం హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని ఐటీ పరిశ్రమ పరిస్థితులపై చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాగ్ నగరం బెంగళూరును మించిపోనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో గత 10 ఏండ్ల ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయని, ఇదే ప్రస్తుత పరిస్థితికి కారణమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన ట్వీట్‌కు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ట్యాగ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరులో టెక్ సదస్సు(బీటీఎస్) నిర్వహిస్తున్న రోజునే మోహన్‌దాస్ పాయ్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
దశ దిశ లేని పాలసీలతో బెంగళూరు అస్తవ్యస్తం
కర్ణాటకలో గత బీజేపీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల దశ దిశ లేని పాలసీలు, ప్రభుత్వంలో అంతులేని అవినీతి కారణంగా పెట్టుబడిదారులు వెనక్కు తగ్గుతున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరంలో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నిరంతర విద్యుత్తు కోతలు, తాగునీటికి తంటాలు, మౌలిక వసతుల లేమి, లోపభూయిష్టమైన పాలసీలు, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతి వెరసి బెంగళూరులో కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు వెనుకడుగు వేస్తున్నారు.
టెకీల నియామకంలో దేశంలోనే మనమే నంబర్1
ప్రపంచ ఐటీ నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడిస్తున్నది. ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల్లో అగ్రభాగాన ఉన్నది. సియాటెల్-వాషింగ్టన్ ప్రధాన కార్యాలయాలుగా పనిచేసే ప్రముఖ టెక్నికల్ ఇంటర్వ్యూ సంస్థ కారత్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. టెకీల నియామకంలో హైదరాబాద్ దేశంలోని అన్ని నగరాల కంటే ముందున్నది. అదే విధంగా ప్రపంచంలోని టాప్-20 నగరాల్లో ఏకంగా పదో స్థానం దక్కించుకోవడం గర్వకారణం. అంతేకాదు.. ప్రతిభ ఉన్న టెకీల కోసం అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని నివేదికలో వెల్లడైంది. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని వాషింగ్టన్, ఆస్టిన్, లాస్ ఏంజిల్స్ వంటి పలు ఐటీ హబ్ నగరాలను కూడా వెనక్కు నెట్టి రికార్డులు సృష్టించింది.
2 లక్షల కోట్లు దాటిన ఐటీ ఎగుమతులు
ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది దేశ వ్యాప్తంగా 17.20 శాతం వృద్ధి రేటు ఉంటే, తెలంగాణలో 26.14 శాతం నమోదైంది. 2022-23లో హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు దాదాపు రూ.2.4 లక్షల కోట్లు దాటాయి. కొత్త ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగానే ఏర్పాటు కావడంతో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అఫీస్ స్పేస్ వినియోగంలోనూ బెంగళూరును హైదరాబాద్ ఎప్పుడో దాటేసింది. గణనీయమైన వృద్ధితో దూసుకుపోతున్నదని అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఇండియా ఇటీవల తన నివేదికలో స్పష్టం చేసింది.
మహానగరానికి అంతర్జాతీయ కంపెనీల క్యూ
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయ సంఖ్యలో అంతర్జాతీయ టెక్ కంపెనీలు హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నది. 2026 కల్లా దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. మరోవైపు నగరంలో భారీ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మరో దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. దీన్ని రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది. 2025 నాటికల్లా దీని కార్యాకలాపాలు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ డాటా సెంటర్ ద్వారా ఐటీ యువ నిపుణులకు మరినిన ఉద్యోగవకాశాలు దక్కనున్నాయి.
కర్ణాటకలో పెట్టుబడులు కష్టం
కర్ణాటకలో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్య ఉన్నది. పరిస్థితులు మారకపోతే, నగరానికి పెట్టుబడులు రావడం కష్టం
– కిరణ్ మజుందార్ షా, బయోకాన్ వ్యవస్థాపకురాలు
తిప్పలు తప్పడం లేదు
కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్నా బెంగళూరులోని స్టార్టప్ కంపెనీలకు తిప్పలు తప్పడం లేదు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో ఇప్పుడు ఎటు చూసినా విద్యుత్తు కోతలు, గతుకుల రోడ్లు, నడిచేందుకు ఏ మాత్రం వీలుకాని ఫుట్‌పాత్‌లు, అస్తవ్యస్థమైన నీటి సరఫరా వ్యవస్థలే.
-రవీశ్ నరేశ్, ఖాతా బుక్ సంస్థ వ్యవస్థాపకుడు
టెక్నాలజీ హబ్.. హైదరాబాద్
హైదరాబాద్ దేశ టెక్నాలజీ హబ్‌గా మారింది. దేశంలో అత్యధిక టెక్ ఉద్యోగాలు కల్పించిన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నది. ఉద్యోగాల కల్పనలో మన హైదరాబాద్ బెంగళూరును అధిగమించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 33 శాతం హైదరాబాద్ నుంచే కాగా.. ఈ ఏడాది అది 44 శాతానికి చేరింది. 2014లో హైదరాబాద్ టెక్ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య 3.2 లక్షలు ఉండగా.. ప్రస్తుతం పది లక్షలకు చేరింది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల విధానాలు, నిపుణులైన యువత ఉండటంతోనే ఇది సాధ్యమైంది.
-వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్లోబల్ బిజినెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాదా.. న్యూయార్కా!
22 ఏండ్ల తర్వాత హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు చూస్తే నేను ఉన్నది ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్లోనా? అర్థం కాలేదు. నేను గతంలో చూసిన హైదరాబాద్‌కు ఇప్పటి నగరానికి పొంతనలేదు. హైదరాబాద్ ఇండియాలోనూ ఆర్థికంగా బాగా ఎదిగింది
-సూపర్‌స్టార్ రజినీకాంత్
భవిష్యత్తు ఇక్కడే కనిపిస్తున్నది!
భవిష్యత్తు అంతా హైదరాబాద్‌లోనే కనిపిస్తున్నది. టీ హబ్ లాంటి ప్రదేశంలో ఇది కనిపిస్తున్నది. టీ హబ్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నది. ఇక్కడ కూడా కాలిపోర్నియాలో ఉన్న అనుభూతినే పొందుతున్నా. టీ హబ్ అతి త్వరలోనే భారత ప్రీమియర్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా మారుతుందనడంలో ఆశ్చర్యం లేదు.
-యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెటి
తెలంగాణలో ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు
సంవత్సరం : ఉద్యోగాలు
2013-14 : 3,23,396
2014-15 : 3,71,774
2015-16 : 4,07,385
2016-17 : 4,31,891
2017-18 : 4,75,308
2018-19 : 5,43,033
2019-20 : 5,82,126
2020-21 : 6,28,615
2021-22 : 7,78,121
2022-23 : 9,05,715