Mobile phone number | న్యూఢిల్లీ : సూపర్‌మార్కెట్స్‌లో బిల్లు చెల్లించేప్పుడు కొనుగోలుదారుడి మొబైల్ నంబర్, వ్యక్తిగత వివరాలు తీసుకోవటాన్ని ఆపేయాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ రిటైల్ సంస్థలను ఆదేశించింది. ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెస్తే వినియోగదారుల రక్షణ చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. మార్గదర్శకాల్ని పాటించాలని రిటైల్ ఇండస్ట్రీ, సీఐఐ, ఫిక్కీలను కోరింది.
కస్టమర్స్ వ్యక్తిగత వివరాలు సేకరించటం గోప్యతా హక్కుకు భంగం కలిగించటమేనని ఆ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. ఆన్లైన్ మోసాలు, వాట్సాస్ సందేశాలతో ఆర్థిక నేరాలకు ఆస్కారం ఏర్పడుతున్నదని చెప్పారు. దీనిపై తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ‘చట్టం ప్రకారం, కస్టమర్స్ మొబైల్ నంబర్స్, వ్యక్తిగత వివరాలు సేకరించటం నేరం. కస్టమర్స్‌పై ఒత్తిడి తేవటం సరైంది కాదు. వ్యక్తిగత ఫోన్ నంబర్‌తో బిల్లింగ్ చేయటం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’ అని ఆయన అన్నారు.