న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత నిశ్శబ్దంగా ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఒరాకిల్ ఉద్యోగులు సెప్టెంబర్ 1న వచ్చే మెయిల్ కోసం వారాల తరబడి సిద్ధమయ్యారు. కానీ వారు ఊహించినట్టు మాత్రం జరగలేదు. గత మార్చి 31న స్థానిక కాలమానం ప్రకారం సుమారు 6 గంటలకు అమెరికా, భారత్, కెనడా వ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్‌ను ఒరాకిల్ పంపింది.
అయితే ఈసారి ఒరాకిల్ సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియను నిశ్శబ్దంగా చేపట్టాలని నిర్ణయించుకుంది. రెడిట్ పోస్ట్‌ల ప్రకారం సెప్టెంబర్ నాటి తొలగింపులు ఇప్పటికే మొదలయ్యాయి. మార్చిలో జరిగినట్టుగా ఉదయం 6 గంటలకు ఆకస్మిక తొలగింపుల ప్రక్రియ మొదలుకాలేదు. కానీ సిబ్బంది స్లాక్ ఖాతాలు మాత్రం మాయమవుతున్నాయని తెలుస్తున్నది. కంపెనీ అంతర్గత కమ్యూనికేషన్ యాప్ ‘స్లాక్’లో లేఆఫ్‌లకు గురైన వారి ఖాతాలు క్రమక్రమంగా కనిపించకుండా పోతున్నాయనే ప్రచారం జరుగుతున్నది. తాజా ఉద్యోగాల కోతలో ప్రపంచవ్యాప్తంగా 7,000 నుంచి 10,000 ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని అంతర్గత వర్గాల అంచనా.