నామ్చీ: సిక్కింలోని నామ్చీ జిల్లా సమర్దుంగ్ ప్రాంతంలోని జోలుంగే వద్ద ఎన్హెచ్పీసీ తీస్తా స్టేజ్-6 జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్న సొరంగంపై కొండ చరియలు విరిగిపడటంతో సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతిచెందగా, మరో ఐదుగురు లోపల చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదం కారణంగా సొరంగం ప్రవేశద్వారం మూసుకుపోవడంతోపాటు, అనుమానాస్పద రీతిలో గ్యాస్ లీకైంది. రెస్క్యూ సిబ్బంది గ్యాస్ మాస్క్ లు ధరించి, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద స్థలంలో పోలీసు విభాగాలు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి.