చెన్నై: స్కూల్ డ్రెస్లో ఉన్న బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఆ చిన్నారిని ఈడ్చుకెళ్లి కరిచాయి. (street dogs attack school girl) గమనించిన ఒక వ్యక్తి పరుగున ఆ బాలిక వద్దకు వచ్చాడు. వీధి కుక్కల బారి నుంచి ఆ చిన్నారిని కాపాడాడు. గాయడిన ఆ బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. తమిళనాడులోని హోసూరులో ఈ సంఘటన జరిగింది. స్కూల్ డ్రెస్లో ఉన్న బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నది. ఇంతలో మూడు వీధి కుక్కలు ఆ చిన్నారిని చుట్టుముట్టి దాడి చేశాయి. బాలికను కరిచి రోడ్డుపై ఈడ్చాయి.
కాగా, గమనించిన ఒక వ్యక్తి పరుగున బాలిక వద్దకు వచ్చాడు. దాడి చేస్తున్న వీధి కుక్కల బారి నుంచి ఆ చిన్నారిని కాపాడాడు. ఇంతలో ఒక మహిళ కూడా ఆ బాలిక వద్దకు వచ్చి ఎత్తుకున్నది. కుక్కలు కరువడంతో గాయపడిన ఆ చిన్నారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వీధి కుక్కలు తమ పిల్లలపై దాడి చేస్తున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.