Sachin Tendulkar | ఒక్కోసారి మనం చేసే చిన్న సాయమే ఎదుటివారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ప్రపంచం సంతోషంగా ఉండాలంటే ఆపదలో ఉన్నవారికి మనకు తోచిన సాయం చేయాల్సిందే. అటువంటి విషయాల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ ఎప్పుడూ ముందుంటారు.
ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సచిన్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సచిన్ గాయాలతో ఉన్న ఓ పావురాన్ని కాపాడారు. బీచ్‌లో సచిన్ వెళ్తుండగా.. ఓ పావురం గాయంతో కింద పడి ఉందట. దీంతో దాన్ని తీసుకొని పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి దానికి అక్కడ తినడానికి గింజలు తీసుకొని దానికి తినిపించారు. కొన్ని నీళ్లు తాగించారు. దీంతో అది కాస్త కుదుటపడింది. రెస్టారెంట్ సిబ్బంది ఆ పావురాన్ని చూసి.. దాని కాలికి గాయం అయిందని చెప్పారు. దీంతో దాని కాలికి కట్టు కట్టించి అది మెల్లగా నడుస్తుండగా దాన్ని వదిలేశారు.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి సచిన్ టెండుల్కర్‌ను ప్రశంసిస్తున్నారు. పావురాన్ని దేవుడు కాపాడాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.