న్యూఢిల్లీ, నవంబర్ 13: మనుషుల మాదిరిగానే ఎలుకలు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. లయకు అనుగుణంగా ఉత్సాహంతో తల ఊపుతూ ఆడుతాయట. బ్రిటిష్ రాక్ మ్యూజిక్ బ్యాండ్‌తో పాటు లేడీ గగా, మొజార్ట్ తదితరుల పాటలను ఇష్టపడుతాయట! ఈ ఆసక్తికర విషయాన్ని జపాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తాజాగా వెల్లడించారు.
వివిధ వేగ స్థాయుల్లో మ్యూజిక్‌ను ప్లే చేసిన సమయంలో వైర్లెస్ యాక్సిలరో మీటర్లను ఉపయోగించి ఎలుకల తల కదలికలను పర్యవేక్షించారు. నిమిషానికి 132 బీట్ల స్థాయిలో మనుషులలాగే ఎలుకలు తల ఊపుతూ సంగీతాన్ని ఆస్వాదించాయని పేర్కొన్నారు. వేగాన్ని తగ్గించినా, పెంచినా ఇష్టపడేవి కావని వివరించారు. దీనికి సంబంధించిన అధ్యయనం సైన్స్ అడ్వాన్స్డ్ జర్నల్‌లో ప్రచురితమైంది.