TVK : నటుడు విజయ్ (TVK Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Eelctions) ఫలితాల్లో తన సత్తా చాటింది. మొత్తం 234 స్థానాలకుగాను ఆ పార్టీ ఏకంగా 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. మ్యాజిక్ ఫిగర్ (Magic figure) కు కేవలం 8 స్థానాలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. ఇక అధికార డీఎంకే (DMK) కేవలం 50 స్థానాలతో సరిపెట్టుకుని మూడో స్థానానికి పరిమితమైంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) 75 స్థానాల్లో ఆధిక్యంతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. టీవీకే మ్యాజిక్ ఫిగర్‌కు మరో ఏడెనిమిది స్థానాలు దూరంలో ఉన్నప్పటికీ తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఏ పార్టీతోనూ తమకు పొత్తు అవసరం రాదని భావిస్తున్నామని టీవీకే ప్రతినిధి ఫెలిక్స్ జెరాల్డ్ చెబుతున్నారు. డీఎంకే, అన్నాడీఎంకే పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఈసారి తమపై నమ్మకం ఉంచారని అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెనుక తమ నాయకుడి కృషి ఎంతో ఉన్నదని చెప్పారు. ఈ ట్రెండ్ తాము ఊహించినదేనని అన్నారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఆయన గుర్తుచేశారు.
ఎలాంటి పొత్తులు అవసరం లేకుండానే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాము ఆశిస్తున్నామని జెరాల్డ్ అన్నారు. దోపిడి, అవినీతి, వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికారని చెప్పారు. ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకునే సరికి టీవీకేకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని జెరాల్డ్ ధీమా వ్యక్తంచేశారు.