డిగ్రీలున్నా దండగే!
మోదీ సర్కార్ పాలనలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని స్వయంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో సగానికిపైగా తక్కువ నైపుణ్యం అవసరమైన పనుల్లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నది.
- విద్యార్హతలకు తగ్గ ఉద్యోగాల్లేవు
- దేశంలో యువ గ్రాడ్యుయేట్లలోసగానికిపైగా లో-స్కిల్స్ ఉద్యోగాల్లోనే
- ప్రధాని ఆర్థిక సలహా మండలి తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ పాలనలో దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువత సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వారికి తగిన ఉద్యోగాలు లభించడం లేదని స్వయంగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(ఈఏసీ-పీఎం) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో సగానికిపైగా తక్కువ నైపుణ్యం అవసరమైన పనుల్లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నది. ఉన్నత విద్యకు, ఉద్యోగ మార్కెట్ అవసరాలకు మధ్య అంతరం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈఏసీ-పీఎం సభ్యుడు, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్, ఎస్బీఐ ఆర్థిక వేత్త శశిధరన్ శర్మ ఈ అధ్యయనాన్ని రూపొందించారు. నూతన జాతీయ విద్యా విధానం-2020 నేపథ్యంలో భారత్‌లో విద్యా సామర్థ్యాల మార్పు: పాఠశాలల వ్యవస్థ, ఉన్నత విద్య, ఉపాధి మార్గాల పేరుతో ఈ నెలలో వర్కింగ్ పేపర్‌ను ప్రచురించారు.
52.8 శాతం మంది లో-స్కిల్ ఉద్యోగాల్లోనే
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా రూపొందించిన ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్-2024 గణాంకాలను ఈ అధ్యయనం ప్రస్తావించింది. 2022లో ఉద్యోగాలు చేస్తున్న యువ గ్రాడ్యుయేట్లలో 52.8 శాతం మంది తక్కువ నైఫుణ్యం అవసరమైన వృత్తుల్లో పనిచేస్తున్నట్టు తెలిపింది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న ఉద్యోగుల్లో 57.8 శాతం మంది రెగ్యులర్ జీతభత్యాల ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ, కేవలం 36.1 శాతం మందికి మాత్రమే ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి లభించినట్టు పేర్కొన్నది. అయితే ఈ గణాంకాల ఆధారంగా వ్యక్తిగతంగా యువతలో నైపుణ్యాల లోపం ఉన్నదని లేదా డిగ్రీల విలువ తగ్గిపోయిందని నిర్ధారించలేమని పరిశోధకులు స్పష్టంచేశారు. ఉన్నత విద్య ద్వారా లభించే ప్రయోజనాలు అందరికీ సమానంగా ఉండటం లేదని, విద్యాసంస్థల ప్రమాణాలు, చదివిన కోర్సు, ప్రాక్టికల్ అనుభవం వంటి అంశాలపై ఉద్యోగావకాశాలు ఆధారపడుతున్నాయని వివరించారు.
క్వాలిఫికేషన్ కంజెషన్ సమస్య
ఉన్నత విద్యార్హతలున్న వారి సంఖ్య పెరుగుతున్నా, కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో వారు చదివిన విద్యాసంస్థ, కోర్సు, పరీక్షల్లో సాధించిన ఫలితాలు, ఇంటర్న్‌షిప్‌లు, పని అనుభవం, పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని అధ్యయనం పేర్కొన్నది. దీనిని పరిశోధకులు క్వాలిఫికేషన్ కంజెషన్గా అభివర్ణించారు. అంటే మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితికి డిగ్రీలే ప్రధాన మార్గమని కుటుంబాలు భావిస్తుండగా, ఉద్యోగ మార్కెట్లో మాత్రం డిగ్రీ ఒక్కటే సరిపోవడం లేదని వివరించారు. మరోవైపు ప్రత్యామ్నాయంగా ఉన్న వృత్తి విద్య, సాంకేతిక శిక్షణ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. 2025 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం 15-29 ఏండ్ల వయసున్న వారిలో కేవలం 5 శాతం మందికే అధికారిక వృత్తి లేదా సాంకేతిక శిక్షణ లభించింది. వృతి విద్యా కోర్సులకు గుర్తింపు, తగిన వేతనాలు, ఉన్నత విద్యకు వెళ్లే అవకాశాలు కల్పించాలని అధ్యయనం సూచించింది. అప్పుడే యువత డిగ్రీలపై మాత్రమే ఆధారపడకుండా నైపుణ్య ఆధారిత ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతారని పేర్కొన్నది.
తగ్గిన పాఠశాలల సంఖ్య
దేశంలో పాఠశాలల వ్యవస్థలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అధ్యయనం తెలిపింది. 2018-19లో 15.51 లక్షలుగా ఉన్న పాఠశాలల సంఖ్య 2025-26 నాటికి 14.67 లక్షలకు తగ్గింది. అంటే 84 వేల పాఠశాలలు తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే బోధించే ప్రాథమిక పాఠశాలల సంఖ్య 8.27 లక్షల నుంచి 7.22 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో 12వ తరగతి వరకు విద్య అందించే పాఠశాలలు 1.30 లక్షల నుంచి 1.69 లక్షలకు పెరిగాయి. దేశంలో జననాల రేటు తగ్గడం, ప్రాథమిక పాఠశాల వయసున్న పిల్లల సంఖ్య క్షీణించడం ఇందుకు కారణాల్లో ఒకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.
ఉన్నత విద్యలో అధ్యాపకుల కొరత
2014-15 నుంచి 2023-24 మధ్య దేశంలో ఉన్నత విద్యలో విద్యార్థుల నమోదు 31.5 శాతం పెరిగింది. 3.42 కోట్ల నుంచి 4.50 కోట్లకు చేరింది. అయితే అధ్యాపకుల సంఖ్య అదే స్థాయిలో పెరగలేదని అధ్యయనం గుర్తించింది. ఇదే కాలంలో అధ్యాపకుల సంఖ్య 14.73 లక్షల నుంచి 17.32 లక్షలకు మాత్రమే పెరిగింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లోనూ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధ్యయనం పేర్కొన్నది. 2023 మార్చి నాటి గణాంకాల ప్రకారం ఐఐటీల్లో 39 శాతం, ఐఐఎంలలో 31 శాతం, ఎన్ఐటీల్లో 29 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

