(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్యన్ (పేరు మార్చాం) ఒరాకిల్ కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వచ్చి పడుకొన్నాడు. మంగళవారం ఉదయం ఆరింటికి ‘ఈ రోజే మీ ఆఖరి పని దినం’ అంటూ కంపెనీ నుంచి సందేశం. అంతే ఒక్కసారిగా ఆర్యన్ మీద పిడుగు పడినంత పనైంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, హోమ్ లోన్, వెహికిల్ లోన్, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత ఇవన్నీ గుర్తొచ్చి ఆర్యన్‌కు ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. ‘కంపెనీ వృద్ధి కోసం 15 ఏండ్లుగా కష్టపడుతున్న.. నా లాంటి ఉద్యోగులకు చివరకు ఇదేనా మీరిచ్చేది? ఒక ఫోన్ లేదు. డిస్కషన్ లేదు. డైరెక్టుగా తీసివేయడమేంటీ? నా భవిష్యత్తు చీకటిమయమైంది’ అంటూ రెడిట్ వేదికగా ఆర్యన్ తన బాధను వ్యక్తం చేశాడు. ఒక్క ఆర్యనే కాదు.. ఒరాకిల్‌లో ఉద్యోగం కోల్పోయిన వేలాది మంది తమ ఆవేదనను ఇలాగే సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేయడం పలువురిని భావోద్వేగానికి గురి చేస్తున్నది. 30 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ తీసుకొన్న నిర్ణయం కార్పొరేట్ రంగంలో సంచలనం సృష్టిస్తున్నది.
ఈ నెలలో మరిన్ని కోతలు
అమెరికా, కెనడా, మెక్సికో, భారత్‌తో పాటు పలు దేశాల్లోని ఒరాకిల్ కంపెనీల్లో మొత్తంగా 1.62 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ఇందులో 30 వేల మందిని తొలగిస్తూ ఒరాకిల్ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం తొలగింపు ఉత్తర్వుల మెయిల్స్‌ను ఆయా ఉద్యోగులకు పంపించింది. భారత్‌లోనే 12 వేల మంది ఉద్యోగులపై వేటు పడినట్టు తెలుస్తున్నది. మేనేజింగ్ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపైనే ఈ లేఆఫ్‌ల ప్రభావం ప్రధానంగా పడినట్టు సమాచారం. ఒరాకిల్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద తొలగింపు ప్రక్రియగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ లేఆఫ్‌లు చేపట్టినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, ఒరాకిల్‌లో కోతలు ఇక్కడితో ఆగిపోలేదని.. రానున్న నెల రోజుల్లో భారత్‌లో పనిచేస్తున్న మరికొంత మంది ఒరాకిల్ ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం పడనున్నట్టు సంబంధిత హెచ్ఆర్ మేనేజర్ ఒకరు మనీకంట్రోల్ వెబ్‌సైట్‌కు తెలిపారు. భారత్‌లోని ఒరాకిల్ ఇండియా కంపెనీలో ఇప్పటివరకూ 30వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, తాజా లేఆఫ్తో ఆ సంఖ్య 18 వేలకు తగ్గింది. ఉద్యోగాల కోత మరింత పెరిగితే, ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉన్నది.
లేఆఫ్‌లు ఎందుకంటే?
కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ప్రస్తుత ఉద్యోగ కోతలను చేపడుతున్నట్టు ఒరాకిల్ పైపైన చెబుతున్నప్పటికీ, సరైన కారణాన్ని మాత్రం వెల్లడించట్లేదు. అయితే, ఓపెన్ఏఐతో భాగస్వామ్యం వల్ల ఏర్పడిన ఆర్థిక భారమే ఈ ఎంప్లాయీస్ కటింగ్‌కు కారణమని పారిశ్రామికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖర్చులు తగ్గింపునకు భారీగా ఉద్యోగాల కోతలు పెడుతున్నది. కాగా ఇన్నేండ్లు సంస్థ కోసం పనిచేసిన తమకు ఇలాంటి వీడ్కోలు ఇవ్వడమేంటని, ముందస్తు చర్చలు జరుపకుండా ఇలా ఉద్యోగం నుంచి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఉద్యోగాలు కోల్పోయిన వారు మండిపడుతున్నారు.
ఒరాకిల్ సమగ్ర స్వరూపం