సోమవారం 13 జూలై 2020
National - Jun 25, 2020 , 09:53:44

దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్నది. గతవారం రోజులుగా 14 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, ఈ రోజు రికార్డు స్థాయిలో 17వేలకు చేరువలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,922 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక వైరస్‌ కారణంగా ఒకేరోజు 418 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,73,105కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 1,86,514 యాక్టివ్‌ కేసులు ఉండగా, 2,71,697 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మహమ్మారి బారినపడినవారిలో ఇప్పటివరకు 14,894 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ర్టాలు 

1. మహారాష్ట్ర- 1,42,900 కేసులు, 6,739 మంది మృతి

2. ఢిల్లీ- 70,390 కేసులు, 2365 మంది మృతి

3. తమిళనాడు- 67,468 కేసులు, 866 మంది మృతి

4. గుజరాత్‌- 28,943 కేసులు, 1735 మంది మృతి

5. ఉత్తరప్రదేశ్‌- 19,557 కేసులు, 596 మంది మృతి

6. రాజస్థాన్‌- 16,009 కేసులు, 375 మంది మృతి

7. పశ్చిమబెంగాల్‌- 15,173 కేసులు, 591 మంది మృతి

8. మధ్యప్రదేశ్‌- 12,448 కేసులు, 534 మంది మృతి

9. హర్యానా- 12,010 కేసులు, 188 మంది మృతి

10. తెలంగాణ- 10,444 కేసులు, 225 మంది మృతి

11. ఆంధ్రప్రదేశ్‌- 10,331 కేసులు, 124 మంది మృతి

నెల రోజుల్లో 3.5 లక్షల కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 23న దేశంలో 1,25,101 కరోనా కేసులు ఉన్నాయి. ఈ సంఖ్య జూన్‌ 25 నాటికి 4,73,105కు పెరిగింది. అంటే దీనిప్రకారం నెల రోజుల్లోనే దేశంలో సుమారు మూడు లక్షల యాభైవేల కేసులు నమోదయ్యాయి. జూన్‌ 1న లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా కేసులు సంఖ్య దేశంలో మరింతగా పెరిగింది. 

75.6 లక్షల మందికి పరీక్షలు

దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి నిన్నటి వరకు మొత్తం 75,60,782 పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,07,871 మందికి పరీక్షలు చేశామని, అందులో 16922 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారని తెలిపింది. 


logo