NASA | న్యూఢిల్లీ: ఇంటి లివింగ్ రూమ్లో కుండీ మొక్క (పాట్ ప్లాంట్)ను పెంచడం, కనీసం కొన్ని నెలల పాటైనా అది సజీవంగా ఉండేలా చూడటం మనకు కష్టమే కావచ్చు. కానీ, ఆర్టెమిస్-3 యాత్ర ద్వారా చంద్రునిపైకి మళ్లీ వ్యోమగాములను పంపనున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ మాత్రం ఇంతకంటే చాలా పెద్ద సవాలును స్వీకరించబోతున్నది. చంద్రుని ఉపరితలంపై డక్వీడ్, క్రెస్, బ్రాసికా (ఆవ) మొక్కలను పెంచడమే ఆ సవాలు.
2026లో జాబిల్లిపై నాసా నిర్వహించ తలపెట్టిన మూడు ప్రయోగాల్లో ‘లీఫ్’ (లూనార్ ఎఫెక్ట్స్ ఆన్ అగ్రికల్చరల్ ఫ్లోరా) ఒకటి. చంద్రుని ఉపరితలంపై మొక్కలను పెంచేందుకు నాసా ప్రయత్నించడం ఇదే తొలిసారి. అంతరిక్షంలోని పరిస్థితులను మొక్కలు ఎలా తట్టుకోగలుగుతాయో తెలుసుకునేందుకు కొలరాడోలోని స్పేస్ ల్యాబ్ టెక్నాలజీస్ సంస్థ ‘లీఫ్’ ప్రయోగాన్ని డిజైన్ చేసింది. దీనిలో భాగంగా వ్యోమగాములు థేల్ క్రెస్, డక్వీడ్ లేదా రెడ్ అండ్ గ్రీన్ బ్రాసికా (దీన్ని ర్యాప్సీడ్ లేదా విస్కాన్సిన్ ఫాస్ట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు) శాంపిళ్లతో కూడిన ‘గ్రోత్ చాంబర్స్’ను చంద్రుని ఉపరితలంపై నెలకొల్పుతారు. ఈ క్యాప్సూళ్లు అధిక రేడియేషన్, సూర్యకాంతి, అంతరిక్ష శూన్యత నుంచి మొక్కలకు రక్షణ కల్పించడంతోపాటు వాటి పెరుగుదలను వ్యోమగాములు పర్యవేక్షించేందుకు వీలుకల్పిస్తాయి. ‘లీఫ్’ ప్రయోగానికి ఎంపిక చేసిన మూడు రకాల మొక్కలు భవిష్యత్తులో ఇతర గ్రహాలపై మానవ కాలనీలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.