Donald Trump : పశ్చిమాసియా (West Asia) లో యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్లక్ష్యపు కామెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) కి సంబంధించి ఆయన మరోసారి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మియామిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని తాము తుడిచిపెట్టామని చెప్పారు. మొజ్తాబా ఖమేనీ కూడా చనిపోయే ఉంటాడని, లేదంటే చావుబతుకుల్లో ఉండి ఉంటాడని వ్యాఖ్యానించారు.
ఇరాన్ దేశపు అత్యున్నత నాయకత్వం, మిలిటరీ శక్తి ధ్వంసమైందని, వారి ముఖ్య నాయకులు మరణించారని, ఆ దేశానికి ఇప్పుడు సుప్రీం లీడరే లేరని ట్రంప్ అన్నారు. మొజ్తాబా ఖమేనీ నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు కాబట్టి ఆయన చనిపోయి ఉండాలని, లేకపోతే ఆయన పరిస్థితి విషమంగానైనా ఉండాలని అని అంచనా వేశారు. కాగా పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతున్నది. ఇలాంటి సమయంలో సుప్రీం లీడర్‌గా ఉన్న మొజ్తాబా పేరిట ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. ఆయన ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. దాంతో ఆయన ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న ట్రంప్.. తాను యుద్ధాలు ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. తాజాగా మరోసారి తాను ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పారు. అంతేగాక తనను తాను శాంతిదూతగా అభివర్ణించుకున్నారు. తాను ఒక శాంతిదూతగా తన మార్క్ ఉండాలని కోరుకుంటున్నానని, ఇప్పుడు అలా అనిపించకపోవచ్చు కానీ, తాను శాంతిదూతనేనని పేర్కొన్నారు.