లక్నో: షాపు వద్దకు వచ్చిన బాలికను ముగ్గరు బాలురు ఒక గదిలోకి లాక్కెళ్లారు. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Boys Gang Rape Girl) దీనిని వీడియో రికార్డ్ చేశారు. ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. షాపు వద్దకు మళ్లీ రావాలంటూ వేధించసాగారు. బాలిక నిరాకరించడంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలిక కుటుంబం దృష్టికి ఇది వెళ్లింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
గోపిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక జూన్ 1న ఇంటి సమీపంలోని షాపు వద్దకు వెళ్లింది. అక్కడున్న ముగ్గురు బాలురు ఆమెను బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్లారు. ఒకరి తర్వాత మరొకరు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాలురు ఈ చర్యను వీడియో రికార్డ్ చేశారు. ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బాలికను బెదిరించారు. అలాగే షాపు వద్దకు మళ్లీ రావాలంటూ ఆమెను వేధించారు. ఆ అమ్మాయి నిరాకరించడంతో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు ఈ వీడియో సంగతి బాధిత బాలిక కుటుంబానికి తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 15 నుంచి 17 ఏళ్ల వయస్సున్న ముగ్గురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో మిర్జాపూర్ జిల్లాలోని జువైనల్ హోమ్‌కు వారిని తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.