న్యూఢిల్లీ : బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే టెన్షన్ లేకుండా బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆర్డర్ చేయగానే ఎలాంటి వస్తువులైనా ఇంటి ముందుకు తీసుకువచ్చే వెసులుబాటును ఇవి కల్పిస్తున్నాయి. అయితే ఈ యాప్‌లతో తలనొప్పులూ ఎదురవుతున్నాయి. డెలివరీ యాప్స్ నిర్వాకంతో వస్తువులు తారుమారవడమే కాకుండా నాణ్యత లేని, నాసిరకం వస్తువులనూ డెలివర్ చేస్తున్నాయని పలువురు యూజర్లు సోషల్ మీడియాలో వాపోతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి బ్రెడ్ కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక కనిపించడంతో షాక్ తిన్నాడు. తాను బ్లింకిట్‌లో బ్రెడ్ ఆర్డర్ చేస్తే తనకు డెలివరీ యాప్ ఎలాంటి షాక్ ఇచ్చిందనే వివరాలను నితిన్ అరోరా ట్విట్టర్లో షేర్ చేశారు. బ్రెడ్ ప్యాకెట్ డెలివరీ తర్వాత అందులో ఎలుక సజీవంగా ఉందని రాసుకొచ్చాడు. ఈనెల 1న తాను బ్రెడ్ ప్యాకెట్‌కు ఆర్డర్ ఇవ్వగా బ్రెడ్ ప్యాకెట్లో బతికున్న ఎలుకను డెలివరీ చేశారని, బ్లింకిట్‌తో చేదు అనుభవం ఎదురైందని పోస్ట్‌కు నితిన్ క్యాప్షన్ ఇచ్చాడు.
ఇలాంటి ప్యాక్ వేగంగా తీసుకువచ్చేందుకు బదులు సరైన డెలివరీ కోసం ఎన్ని గంటలైనా ఎదురుచూసేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఘటనపై కంపెనీ కామెంట్స్ సెక్షన్లో స్పందించింది. హాయ్ నితిన్ మీకు ఇలాంటి అసౌకర్యం కలగాలని తాము కోరుకోలేదని..మీ రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ లేదా ఆర్డర్ ఐడీ పంపితే సమస్యను పరిష్కరిస్తామని బదులిచ్చింది.