హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘మకుటం’. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్వర్గీయ ఆర్బీచౌదరి సమర్పకులు. ఇది ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్‌ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రం కావడం విశేషం. ఈ నెల 14న భారీ ఎత్తున సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి యాక్షన్ మోడ్‌లో సాగిన ఈ ట్రైలర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. విశాల్ మూడు విభిన్నమైన అవతారాల్లో కనిపిస్తూ ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మాస్‌కి కావాల్సిన యాక్షన్, యూత్‌కి కావాల్సిన లవ్, రొమాన్స్.. కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చెబుతున్నది. ‘ఆ సరుకును నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వనురా’ అనే డైలాగ్‌ని లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పిన తీరు బావుంది. ట్రైలర్ చివరి షాట్ హైలైట్. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, అభినందన్ రామానుజం, సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాతలు: బి.సురేశ్, ఆర్బీ జీవన్ చౌదరి, జితన్ రమేశ్, జీవా.