MK Stalin : తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి (Former CM), డీఎంకే అధినేత (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) కు మద్రాస్ హైకోర్టు (Madras High Court) లో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు (Kolathur) అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు (EVMs), వీవీప్యాట్ (VVPAT) ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. బాబుకు 82,997 ఓట్లు (45.09 శాతం) రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు (40.32 శాతం) వచ్చాయి. దాంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మే 4న ఫలితాలు వెలువడగా.. మే 7నే 14 ఈవీఎంల బర్న్ట్ మెమొరీ, మైక్రో కంట్రోలర్‌ను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి స్టాలిన్ దరఖాస్తు చేశారు.
కానీ ఈ 14 ఈవీఎంలు నియోజకవర్గంలోని మొత్తం 286 యంత్రాల్లో 5 శాతం. అయితే ఈ పరిశీలన జూలై 29న మాత్రమే జరిగింది. పరిశీలన సమయంలో రెండు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయని, మరో యంత్రానికి సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లపై అడ్రస్ ట్యాగ్లు సరిగ్గా లేకపోవడంతోపాటు సీల్ విషయంలోనూ లోపాలు ఉన్నాయని స్టాలిన్ ఆరోపించారు. ఒక కంట్రోల్ యూనిట్ తన పేరున్న బ్యాలెట్ యూనిట్‌ను గుర్తించలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కొలత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలను పరిశీలించడంతోపాటు 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని స్టాలిన్ కోర్టును కోరారు. ఈవీఎంల పరిశీలనలో బయటపడిన లోపాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వీఎస్ బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని, తనను విజేతగా ప్రకటించాలని కూడా అభ్యర్థించారు. స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే స్టాలిన్ పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం వాదించింది.
ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ ‘నాట్ మెయింటెయినబుల్’ అని పేర్కొంటూ కొట్టివేసింది. దాంతో కొలత్తూరు ఎన్నికల ఫలితాలను ఈవీఎంల ఆధారంగా సవాలు చేసిన స్టాలిన్ ప్రయత్నానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.