తిరువనంతపురం: ఒక వ్యక్తి వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరణించినట్లు భావించాడు. ఆ మహిళను బావిలో పడేశాడు. మద్యం మత్తులో ఈ విషయాన్ని స్నేహితుడికి అతడు చెప్పడంతో పోలీసులకు తెలిసి అరెస్ట్ చేశారు. (Man dump woman in well) కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సురేష్ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. పెరుంబవూర్ రైల్వే పట్టాల సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న అద్దె ఇంట్లో అతడు నివసిస్తున్నాడు.
కాగా, కొన్ని రోజుల కిందట 65 ఏళ్ల వృద్ధురాలిని సురేష్ తన ఇంటికి తీసుకువచ్చాడు. వారిద్దరి మధ్య గొడవ జరుగడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వృద్ధురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందని భావించాడు. సమీపంలోని ఒక బావిలో ఆమెను పడేశాడు.
మరోవైపు శనివారం మద్యం సేవించిన సురేష్ ఆ మత్తులో ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. దీంతో పోలీసులకు ఇది తెలిసింది. ఈ నేపథ్యంలో సురేష్ ఇంటికి చేరుకుని సోదా చేశారు. ఇంట్లో ఉన్న అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
సురేష్ సమాచారం ఆధారంగా అగ్నిమాపక సిబ్బందితో కలిసి వృద్ధురాలి మృతదేహాన్ని బావి నుంచి పోలీసులు వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సురేష్‌ను అరెస్ట్ చేసి అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. సురేష్ స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.