బెంగళూరు: నేటి వివాహ వ్యవస్థలో విస్తృతంగా నడుస్తున్న ట్రెండ్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్. ఇది రానురాను కొత్త పుంతలు తొక్కుతున్నది. చిత్ర విచిత్రాలుగా ఫొటోషూట్స్ తీస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఒక వైద్యుడు ఆపరేషన్ థియేటర్లో తన కాబోయే భార్యతో కలిసి ఒక రోగికి శస్త్ర చికిత్స చేస్తున్నట్టుగా నటిస్తూ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేశారు. చిత్రదుర్గ జిల్లాలోని బరమసాగర్ ప్రభుత్వ దవాఖానలో ఈ ఘటన జరిగింది.
ఇందుకు బాధ్యుడైన కాంట్రాక్ట్ వైద్యుడు అభిషేక్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆపరేషన్ థియేటర్లో చిత్రీకరించిన ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. అది వైరల్‌గా మారింది. డాక్టర్ అభిషేక్‌ను విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గూండూరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలు ఉన్నది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకని, అంతే తప్ప వ్యక్తిగత పనుల కోసం కాదని స్పష్టం చేశారు.