Chandrayaan-4 | పుణే, నవంబర్ 17: చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్లకు ఇస్రో సిద్ధమవుతున్నది. లూపెక్స్, చంద్రయాన్-4 ప్రాజెక్టుల ద్వారా 350 కేజీల ల్యాండర్‌ను చంద్రుడి 90 డిగ్రీల ప్రాంతంలో(చీకటి వైపు) ల్యాండ్ చేయడానికి, శాంపిల్ రిటర్న్ మిషన్ ప్రయోగానికి పనిచేస్తున్నామని అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వెల్లడించారు.
శుక్రవారం పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘చంద్రయాన్-4లో చంద్రుడిపై దిగిన తర్వాత అక్కడి ఉపరితలం నుంచి శాంపిల్ తీసుకొని వెనక్కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే 5-7 ఏండ్లలో ఈ ప్రతిష్టాత్మక మిషన్‌ను చేపడతాం’ అని ఆయన అన్నారు.