Hot cities | ఉడుకుతున్న నగరాలు.. పెరుగుతున్న పట్టణీకరణే ప్రధాన కారణం
Hot cities | కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోతూ, వేగంగా పచ్చదనం కోల్పోతున్న దేశంలోని నగరాలు ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతున్నాయి. మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే స్థాయికి ఉష్ణ సూచిక(హీట్ ఇండెక్స్) చేరుకుంటున్నది. గాలి ఉష్ణోగ్రత, భూ ఉపరితల ఉష్ణోగ్రత, అధిక తేమ వాతావరణం వల్ల నగరాల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.
- నగరాల్లో ప్రమాదకర స్థాయికి ‘హీట్ ఇండెక్స్’
- హైదరాబాద్ సహా మెట్రో నగరాలకు ముప్పు
- రాత్రుళ్లు సైతం నగరాల్లో 60% ఎక్కువ వేడి
- రెండు అధ్యయనాల్లో కీలక అంశాలు వెల్లడి
న్యూఢిల్లీ, మే 28: కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోతూ, వేగంగా పచ్చదనం కోల్పోతున్న దేశంలోని నగరాలు ప్రమాదకర స్థాయిలో వేడెక్కుతున్నాయి. మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపించే స్థాయికి ఉష్ణ సూచిక(హీట్ ఇండెక్స్) చేరుకుంటున్నది. గాలి ఉష్ణోగ్రత, భూ ఉపరితల ఉష్ణోగ్రత, అధిక తేమ వాతావరణం వల్ల నగరాల్లో వేడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. రాత్రిపూట సైతం వాతావరణం వేడిగానే ఉంటున్నది. దేశంలోని నగరాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ), ఐఐటీ భువనేశ్వర్ చేసిన రెండు వేర్వేరు అధ్యయనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నాయి.
ప్రమాదానికి చేరువలో హీట్ ఇండెక్స్
ఢిల్లీకి చెందిన సీఎస్ఈ దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 2001 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వాతావరణంపై అధ్యయనం చేసింది. ఇందులో ప్రధాన నగరాల్లో ఏటా ఉష్ణ సూచిక పెరిగిపోతున్నదని తేల్చింది. అసలైన ఉష్ణోగ్రతకు తోడుగా తేమను పరిగణనలోకి తీసుకొని ఎంత వేడిగా ఉందో ఉష్ణ సూచికతో లెక్కిస్తారు. ఇది 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రధాన నగరాల్లో హీట్ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి దగ్గరలో ఉన్నది. ప్రస్తుతం వేసవిలో సగటున చెన్నైలో 37.4 డిగ్రీలు, కోల్‌కతాలో 36.5 డిగ్రీలు, ముంబైలో 34.3 డిగ్రీలు, ఢిల్లీలో 32.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 29.3 డిగ్రీలు, బెంగళూరులో 26.9 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్ నమోదవుతున్నది.
పెరుగుతున్న నిర్మాణాలు.. తగ్గిన పచ్చదనం
పెరుగుతున్న పట్టణీకరణకు, వేడి ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని అధ్యయనం గుర్తించింది. గత రెండు దశాబ్దాలుగా ఈ నగరాల్లో వేగంగా కాంక్రీట్ నిర్మాణాలు జరిగాయని, పచ్చదనం తగ్గిపోయిందని ఫలితంగా వేడి పెరుగుతున్నదని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో చెన్నై బిల్ట్‌అప్ ఏరియా(నిర్మాణాలు) రెండింతలైంది. ముంబైలో 2003లో 38.4 శాతంగా ఉన్న బిల్ట్‌అప్ ఏరియా 2023 నాటికి 52.1 శాతానికి చేరుకుంది. ఇదే సమయంలో పచ్చదనం మాత్రం 35.8 శాతం నుంచి 30.2 శాతానికి తగ్గింది. బెంగళూరులో బిల్ట్‌అప్ ఏరియా 37.5 శాతం నుంచి ఏకంగా 71.5 శాతానికి పెరిగింది. చెన్నైలో 30.7 శాతం నుంచి 73.5 శాతానికి పెరిగింది. పచ్చదనం 34 శాతం నుంచి 20.3 శాతానికి పడిపోయింది.
వర్షాకాలంలోనూ తగ్గని వేడి
సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు కంటే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండాలి. కానీ గత పదేండ్లుగా ఈ పరిస్థితి మారిపోతున్నది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో ఉష్ణ సూచిక వర్షాకాలానికి ముందు కంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుండగా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కొంత చల్లగానే ఉంటున్నదని సీఎస్ఈ గుర్తించింది. మొత్తంగా 2001 – 10తో పోలిస్తే గత పదేండ్లలో వర్షాకాలంలో సగటున 1 డిగ్రీ సెల్సియస్, వర్షాకానికి ముందు ప్రీ మాన్సూన్లో 0.5 డిగ్రీల సెల్సియస్ వేడి పెరిగింది.
అత్యవసర చర్యలు అవసరం
ప్రస్తుతం భారత జనాభాలో 36 శాతం(40 కోట్లు) పట్టణ జనాభా ఉండగా, 2050 నాటికి ఇది రెట్టింపు అవుతుందని, 80 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో నగరాల్లో వేడిని తగ్గించడానికి నీటి వనరులను, పచ్చదనాన్ని పెంచాలని పేర్కొన్నది. వేడిని ఉత్పత్తి చేస్తున్న కాంక్రీట్ ఉపరితలం, వాహనాలు, పరిశ్రమలు, ఏసీ వంటి వాటి వినియోగం, నిర్వహణలో మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొన్నది. సాధారణంగా ఆరోగ్యపరమైన అత్యవసర చర్యలు తీసుకునేటప్పుడు కేవలం పగటిపూట ఉష్ణోగ్రతలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, రాత్రి ఉష్ణోగ్రతలు, తేమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్ కొంత మెరుగు
ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నగరంలో 2003లో 20.6 శాతంగా ఉన్న బిల్ట్‌అప్ ఏరియా 2023 నాటికి 44 శాతానికి పెరిగింది. 2003లో 8.9 శాతంగా ఉన్న పచ్చదనం 2023నాటికి ఏకంగా 26.5 శాతానికి పెరిగింది. గత పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టడం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి ప్రయత్నాలు ఫలించినట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతున్నది.
రాత్రి పూటా సెగలే
సాధారణంగా పగటి పూట వేడి కారణంగా భూఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కుతుంది. రాత్రివేళ చల్లబడుతుంది. 2001 – 2010 మధ్య పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతతో పోలిస్తే 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 13.2 డిగ్రీల సెల్సియస్ వరకు భూఉపరితల ఉష్ణోగ్రత తగ్గేది. 2014 – 23 మధ్య మాత్రం 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 11.5 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే రాత్రిపూట భూఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతున్నదని సీఎస్ఈ పేర్కొన్నది. పట్టణీకరణ ఎక్కువవడమే ఈ పరిస్థితికి కారణమని ఐఐటీ భువనేశ్వర్ గుర్తించింది. పట్టణాలు, నగరాల్లో ఎక్కువగా విస్తరించి ఉండే కాంక్రీట్, తారు పగటిపూట వేడిని గ్రహించి రాత్రిపూట వదులుతున్నదని, ఫలితంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తేల్చింది. మరోవైపు దేశంలోని 140 ప్రధాన నగరాలపై అధ్యయనం చేసిన ఐఐటీ భువనేశ్వర్ పరిశోధకులు.. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లో రాత్రిపూట 60 శాతం ఎక్కువ వేడి ఉంటున్నదని గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

