న్యూఢిల్లీ, నవంబర్ 26: అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ బుకింగ్, రైడింగ్ అనుభవాన్ని భారత్‌కు చెందిన చెఫ్ నేహా దీపక్ షా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకొన్నారు. ‘నా మొదటి డ్రైవర్ లెస్ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీ’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చిన ఆమె.. ఇది తనకు సరికొత్త అనుభూతి ఇచ్చిందని అన్నారు. ఉబర్ యాప్ మాదిరిగానే ఉండే ఒక యాప్ ద్వారా శాన్ఫ్రాన్సిస్కోలో తాను ఈ ట్యాక్సీ బుక్ చేశానని, క్యాబ్ వచ్చిన తర్వాత అదే యాప్‌తో కారు డోర్లను అన్‌లాక్ చేశామని వీడియోలో వివరించారు.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు తనకు ‘టార్జాన్:ది వండర్ కారు’ సినిమాను గుర్తు చేసిందని నేహా దీపక్ షా ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకొన్నారు. కాగా, నేహా పోస్టు చేసిన ఈ వీడియోకు 1.4 కోట్ల వీక్షణలు వచ్చాయి. నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు. ‘సెల్ఫ్ డ్రైవింగ్ కారుపై విశ్వాసం లేని వారు అలా చేయలేరు’ అని ఒకరు, ‘మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేందుకు ఇది సురక్షితం’ అంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు.