గువాహటి, మార్చి 24: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరుతానంటూ కనిపించకుండా పోయిన ఐఐటీ గువాహటి స్టూడెంట్ను అస్సాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలు అరెస్టు చేశాయి. సదరు విద్యార్థికి ఐసిస్‌తో సంబంధాలు ఉన్నట్టు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని పోలీస్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు.
ఐఐటీ-గువాహటి క్యాంపస్‌లో నాలుగో ఏడాది బయో టెక్నాలజీ చదువుతున్న విద్యార్థి తౌసీఫ్ అలీ ఫారూకీని అరెస్టు చేసినట్టు ఎస్టీఎఫ్ ఐజీ పార్థసారథి మహంతా మీడియాకు తెలిపారు. నిందితుడిపై ఐపీసీలోని వివిధ సెక్షన్లు, ఉపా కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.