లండన్ : బ్రిటన్‌లో భారతీయ రుచులకు వేదికగా నిలిచి ఏడు దశాబ్ధాలుగా సేవలందిస్తున్న లండన్ రెస్టారెంట్ ఇండియా క్లబ్ సెప్టెంబర్‌లో మూతపడనుంది. 1951 నుంచి లండన్‌లో ది ఇండియా క్లబ్ రెస్టారెంట్ భారతీయ వంటకాలను అందిస్తూ ఆతిధ్యం ఇస్తోంది. ప్రతిష్టాత్మక ఇండియన్ రెస్టారెంట్ మూతపడుతుండటం భారతీయులకు నిరాశ కలిగిస్తోంది.
ఆధునిక హోటల్‌ను నిర్మించేందుకు భవనం నుంచి ఖాళీ చేయాలని రెస్టారెంట్ నిర్వాహకులకు యజమానులు నోటీసులు జారీ చేశారు. ఇండియా క్లబ్‌ను మూసివేస్తున్నామని బరువెక్కిన హృదయంతో వెల్లడిస్తున్నామని, సెప్టెంబర్ 17న రెస్టారెంట్ సేవలకు చివరి రోజని నిర్వాహకులు వెల్లడించారు. 1950, 1960 ప్రాంతాల్లో భారతీయులు తమ వారిని కలుసుకుని, ఇష్టమైన దేశీ రుచులను ఆస్వాదించేందుకు ఇది ఒక్కటే సరైన ప్రదేశంగా ఉండేదని ఇండియా క్లబ్‌కు తరచూ వచ్చే చరిత్రకారులు కుసుమ్ వద్గమ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.
తాము వేరే దేశంలో ఉన్నామనే భావనను పోగొట్టేందుకు అప్పట్లో ఇండియా క్లబ్ తమకు ఆసరాగా నిలిచేదని పేర్కొన్నారు. ఇండియా క్లబ్ ఇంటీరియర్స్ సైతం స్వాతంత్ర్యానికి ముందున్న కాఫీ షాపులను తలపించేలా ఉండేదని చెబుతుంటారు. ఇక్కడ లభించే ఫుడ్ రుచికరంగా ఉండటంతో పాటు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ఇక్కడ దోశె, బటర్ చికెన్, పకోడీలు, మసాలా ఛాయ్, కాఫీలను భారతీయులు ఇష్టంగా ఆస్వాదించేవారు.
Read More :
Onam | ఓనం వేడుకల్లో సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా..