LPG, PNG Connections : పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ను వినియోగిస్తున్నారు. ఇలా రెండు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉండటంపై కేంద్ర ప్రభుత్వం (Union govt) గత నెలలో నిషేధం విధించింది. ఈ మేరకు మార్చి నెలలో ఉత్తర్వులు జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు ఆ వెంటనే స్వచ్ఛంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు వదులుకోవాలి. కానీ చాలా మంది అలా చేయడం లేదు. రెండు కనెక్షన్లను కొనసాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు దుర్వినియోగాన్ని అరికట్టడానికి, సబ్సిడీలను సమర్థంగా అందించడానికి రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలను గుర్తించే పనిలో పడింది. రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని గుర్తించి వారికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను కట్ చేయనుంది. పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వంటగ్యాస్ సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు.. PNG విస్తరణను వేగవంతం చేసేందుకు కేంద్రం రెండు రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవాళ్లను గుర్తిస్తోంది.
ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఉత్తర్వుల ప్రకారం.. అప్పటికే PNG కనెక్షన్ తీసుకున్నవారు ఎల్పీజీ కనెక్షన్‌ను వదులుకోవాలి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ కంపెనీలు కూడా అప్పటికే పీఎన్జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులకు కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ ఇవ్వకూడదు. పాత ఎల్పీజీ కనెక్షన్ వదులుకోకుండా ఉంచుకున్నా కొత్తగా గ్యాస్‌ను ఫిల్ చేయకూడదు.