SIM cards : దేశంలో ఒక వ్యక్తి తన పేరుమీద ఎన్ని సిమ్‌కార్డులు కలిగి ఉండాలి అనే విషయంపై చట్టాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే, ఈ చట్టాల్ని ఇప్పుడు కేంద్రం మరింత కఠినతరం చేయనుంది. ఇందుకోసం కొత్త రూల్స్ ఆగష్టు 24 నుంచి అమలుకానున్నాయి. ఇకపై పరిమితికి మించి సిమ్‌లు ఒక వ్యక్తి కలిగి ఉంటే వారికి టెలికాం సంస్థలు కొత్త సిమ్ జారీ చేయకూడదు.
ఈ మేరకు ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఈ నెల 17న ఒక సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారులు పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉండకుండా టెలికాం సంస్థలు సాంకేతికపరమైన, సంస్థాపరమైన చర్యలు తీసుకోవాలని డాట్ సూచించింది. ఈ మేరకు తగిన ప్రమాణాలు పాటించాలని చెప్పింది. మరి ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉన్నాడో టెలికాం సంస్థలు గుర్తించేదెలా..? ఇందుకోసమే ప్రభుత్వం డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం రూపొందించింది. ఇందులో కస్టమర్ల డీటైల్స్ అన్నీ ఉంటాయి. ఒక కస్టమర్ ఎన్ని సిమ్‌లు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని టెలికాం సంస్థలు ఇందులో అప్డేట్ చేస్తాయి.
దీంతో కస్టమర్‌కు సంబంధించిన సిమ్ల వివరాలు లభిస్తాయి. కంపెనీలు దీని ఆధారంగా కస్టమర్ సిమ్ లిమిట్ పూర్తైందా.. కొత్త సిమ్ జారీ చేయాలా అనే విషయాన్ని నిర్ధరిస్తాయి. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాంలో ఫొటో ఐడెంటిటీ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టబోతుంది. ఒకవేళ పరిమితికి మించి సిమ్‌కార్డు జారీ అయితే, ఆ తర్వాత ఆ సిమ్ కార్డును వెంటనే రద్దవుతుంది. ఈ అంశంలో కస్టమర్‌పై లేదా టెలికాం ఆపరేటర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లిమిట్ దాటిన వారు కొత్త సిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి లిమిట్ దాటిన విషయాన్ని తెలియజేయాలి. సిమ్ కార్డ్ లిమిట్ నిబంధన కొత్తదేం కాదు. దాదాపు పదేళ్ల క్రితం నుంచే డాట్ ఈ రూల్ అమలు చేస్తోంది.
ఇది దేశంలోని అన్ని టెలికాం సంస్థలు పాటించాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులు కలిగి ఉండొచ్చు. అలాగని, ఒక్కో నెట్వర్క్ సిమ్‌లు తొమ్మిది కాదు. అన్ని నెట్‌వర్క్‌ల సిమ్‌లు కలిపి 9 దాటకూడదు. అయితే, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం వినియోగదారులు గరిష్టంగా 6 సిమ్‌కార్డులు మాత్రమే తీసుకోవాలి. ఈ రూల్స్ ఎప్పటినుంచో ఉన్నా సరిగ్గా అమలు కావడం లేదు. ఈ రూల్స్ అమలు చేసేందుకు తగిన ప్రమాణాలు లేవు.
కానీ, ఇకపై ఈ రూల్స్ కచ్చితంగా అమలు చేయాలని టెలికాం కంపెనీలను డాట్ ఆదేశించింది. కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్న వినియోగదారులు తమ పేరుమీద అప్పటికే ఉన్న ఫోన్ నెంబర్ల వివరాలను అందించాలి. దరఖాస్తు ఫాంలో ఆ నెంబర్లు అన్నింటినీ రాయాలి. వేరే ఆపరేటర్లకు సంబంధించినవి కూడా.