Google flights | న్యూఢిల్లీ: హాలీడే ట్రిప్‌కి విదేశాలకు వెళ్తున్నారా? దైవ దర్శనానికి ఏ షిర్డీకో.. తిరుపతికో వెళ్తున్నారా? అయితే తొందర పడకండి. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందు ఒక్కసారి గూగుల్‌ని అడగండి. ఏ రోజున టిక్కెట్ రేట్లు చీప్‌గా ఉంటాయో.. ఏ సమయంలో బుక్ చేసుకుంటే తక్కువ ధరలకే గమ్యస్థానాలకు వెళ్లవచ్చో ఇకపై గూగుల్ చెబుతుంది. టిక్కెట్ ధరలకు సంబంధించి ‘గూగుల్ ఫ్లైట్స్’లో తాజాగా మరో ఫీచర్‌ను జోడించారు. ఈ ఫీచర్ సాయంతో తక్కువ ధరలకే టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. నూతన ఫీచర్లను గూగుల్ బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. గూగుల్ ఫ్లైట్స్‌లో ఇదివరకే అందుబాటులో ఉన్న ప్రైస్ ట్రాకింగ్ అలర్ట్స్, ప్రైస్ గ్యారంటీ చాయిస్లకు అదనంగా కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసుకొని నగదును ఆదా చేసుకోవచ్చు. ఏ సమయంలో తక్కువ ధరలు ఉంటాయో.. ఎప్పుడు బుక్ చేసుకోవాలి.. తదితర డాటాను ఇది అందిస్తుంది.
ప్రైస్ గ్యారంటీ ఫీచర్…
కొన్ని ఎంపిక చేసిన రూట్లలో గూగుల్ ప్రైస్ గ్యారంటీ చాయిస్‌ను అందిస్తున్నది. దీని ప్రకారం కొన్ని రూట్ల విమాన టిక్కెట్ల రేట్లపై బ్యాడ్జ్ ఉంటుంది. సదరు రూట్లలో అదే అతి తక్కువ ధర అని దీనర్థం. మీరు టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత రేట్ తగ్గితే.. ఆ వ్యత్యాసాన్ని ‘గూగుల్ పే’లో జమ చేస్తారు. దీన్నే ప్రైస్ గ్యారంటీ అంటారు.