e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home Top Slides ఇది నేషనల్‌ ఎమర్జెన్సీ

ఇది నేషనల్‌ ఎమర్జెన్సీ

  • టీకాలు, ఆక్సిజన్‌పై జాతీయ ప్రణాళిక ఇవ్వండి
  • కరోనా సంక్షోభంపై కేంద్రానికి సుప్రీం ఆదేశం
  • లాక్‌డౌన్‌ నిర్ణయం రాష్ర్టాలకే ఉండాలి
  • కోర్టుల న్యాయ పరిధిపై పరిశీలిస్తాం
  • 4 అంశాలపై సుప్రీంకోర్టు విచారణ
  • చావులు పట్టవా?
  • నిమ్మకు నీరెత్తినట్టు కేంద్రం
  • ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఇది నేషనల్‌ ఎమర్జెన్సీ

దేశంలో పరిస్థితి ఆరోగ్య ఎమర్జెన్సీని తలపిస్తున్నది. ఇది సుప్రీం కోర్టు వ్యాఖ్య. కేంద్రం ఇంకెప్పుడు మేల్కొంటుంది? చావులు పట్టవా? ఆక్సిజన్‌ లేక జనం చావాలా?.. ఇదీ ఢిల్లీ హైకోర్టు కేంద్రంపై చేసిన తీవ్ర విమర్శ.రెమ్‌డెసివిర్‌ సరఫరాలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల మధ్య వ్యత్యాసాలెందుకు చూపుతున్నారు? ఇది గుజరాత్‌ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరిన వివరణ!
కరోనా సంక్షోభం చేయిదాటిపోతుండటంతో అత్యున్నత న్యాయస్థానంతోపాటు.. అన్ని రాష్ర్టాల హైకోర్టులూ తీవ్రంగా స్పందించాయి. మోదీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై విపక్షాలూ ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఆక్షేపించాయి. అన్నివైపులనుంచి ఒక్కసారిగా విమర్శలు ముప్పిరిగొనడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఆక్సిజన్‌ సంక్షోభం, కరోనా వ్యాప్తిపై అత్యవసరంగా ఉన్నతస్థాయి సమీక్షాసమావే శాలు నిర్వహించారు. శుక్రవారం రాష్ర్టాల ముఖ్య మంత్రులు, ఆక్సిజన్‌ ఉత్పత్తిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నా రు. ఈ క్రమంలో బెంగాల్‌ ఎన్నికల ప్రచార పర్యటనను కూడా రద్దుచేసుకొన్నారు.

ఇది నేషనల్‌ ఎమర్జెన్సీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: కొవిడ్‌తో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడం, దవాఖానల్లో ఆక్సిజన్‌, బెడ్లు, యాంటివైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌ కొరతపై దేశంలోని ఆరు హైకోర్టులు పిటిషన్లను విచారిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా రంగంలోకి దిగింది. పరిస్థితి మెడికల్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్నదని కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచడంపై కేంద్రం రూపొందించే జాతీయ ప్రణాళిక కోసం ఎదురుచూస్తున్నామని సీజేఐ జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసం తెలిపింది. ఈ రెండింటితోపాటు.. వ్యాక్సినేషన్‌ తీరుతెన్నులు, లాక్‌డౌన్‌పై రాష్ర్టాల నిర్ణయాధికారం విషయంలో కేంద్రానికి నోటీసులు జారీచేసింది. కొవిడ్‌ రోగులకు చికిత్సలో ఆక్సిజన్‌ అనేది అత్యంత కీలకమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. ప్రస్తుత పరిస్థితిలో ఉపశమనం కోసం ప్రజలు వివిధ కోర్టులను ఆశ్రయిస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్‌ సరఫరాలో సమానత్వం ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో ఏ) ఆక్సిజన్‌ సరఫరా, బీ) అత్యవసర ఔషధాల పంపిణీ, సీ) వ్యాక్సినేషన్‌ పద్ధతి, విధానం, డీ) లాక్‌డౌన్‌ ప్రకటన.. ఈ నాలుగు అంశాలపై సార్వజనీన ఆదేశాలను ఎందుకు జారీ చేయకూడదో చెప్పాలని కోరింది. ఈ అంశాలపై రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలను సంప్రదిస్తూ కేటాయింపులు చేసేందుకు ఒక సమన్వయ కమిటీని నెలకొల్పడంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. సదరు కమిటీ.. పరిస్థితి తీవ్రత, కొవిడ్‌ బాధితుల సంఖ్య, స్థానికంగా వనరుల లభ్యతపై దృష్టి సారించాలని సూచించింది. జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఆర్‌ భట్‌ కూడా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.

వాటిని నిత్యావసరాలుగా ప్రకటిస్తారా?
కొవిడ్‌కు సంబంధించిన అత్యవసర ఔషధాలు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌లను నిత్యావసరాలుగా ప్రకటించడం, వాటి రవాణాకు ఆటంకాలు లేకుండా చూడటంపైనా కేంద్రం స్పందించాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి భీకరంగా ఉన్నది. కొవిడ్‌ పేషెంట్లు, మరణాల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తున్నది. వ్యాక్సిన్‌తో కొవిడ్‌కు సహజంగానే అడ్డుకట్ట వేయవచ్చు. అదే సమయంలో రెమ్‌డెసివిర్‌ వంటి కొన్ని ఔషధాలతో కొవిడ్‌కు చికిత్స అందించవచ్చు. ఆక్సిజన్‌ కూడా అత్యంత ముఖ్యమైనది’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వీటన్నింటిపై శుక్రవారానికల్లా నివేదిక అందజేయాలని కోరుతూ విచారణను వాయిదా వేసింది. ఈ అంశాల్లో కోర్టుకు సహకరించేందుకు సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వేను సుప్రీం నియమించింది.

లాక్‌డౌన్‌ అధికారం రాష్ర్టాలకే ఉండాలి
లాక్‌డౌన్‌పై నిర్ణయాధికారం రాష్ర్టాలకే ఉండాలని, ఇది కోర్టు పరిధిలో ఉండరాదని కోరుకుంటున్నామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. లాక్‌డౌన్‌ విధించేందుకు హైకోర్టులకు ఉన్న న్యాయపరిధిపై పరిశీలన జరుపాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. ఢిల్లీ, బొంబాయి, సిక్కిం, మధ్యప్రదేశ్‌, కలకత్తా, అలహాబాద్‌ హైకోర్టులు కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన వివిధ అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్నాయన్న సుప్రీంకోర్టు.. ఇదంతా గందరగోళానికి దారితీస్తున్నదని, భిన్నమైన ప్రాధాన్యాలకు అనుగుణంగా వనరులు మళ్లుతున్నాయని అభిప్రాయపడింది. ‘ఒక హైకోర్టు ఒకరికి.. మరో కోర్టు మరొకరిని ప్రాధాన్య గ్రూపుగా పరిగణిస్తున్నది’ అని పేర్కొన్నది. తమిళనాడులో మూతపడిన తమ కాపర్‌ ప్లాంట్‌ను ఆక్సిజన్‌ తయారీ కోసం తిరిగి తెరిచేందుకు అనుమతించాలని వేదాంత కంపెనీ దాఖలుచేసిన వేరొక పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితి ‘జాతీయ అత్యయిక పరిస్థితి’లా ఉన్నదని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలేవి?: కలకత్తా హైకోర్టు
కరోనా విజృంభిస్తున్న సమయంలో 8 దశల్లో జరుగుతున్న బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొవిడ్‌ నిబంధనలను అమలు చేస్తున్న తీరుపై కలకత్తా హైకోర్టు అసంతృప్తిని వ్యక్తంచేసింది. ‘ఎన్నికల కమిషన్‌కు తగిన చర్యలు తీసుకునే అధికారం ఉన్నది. కానీ.. ఏం చేస్తున్నది? కొవిడ్‌ జాగ్రత్తలపై సర్క్యులర్లు, సమావేశాలతో సరిపెడుతున్నది’ అని అభిశంసించింది. పూర్వ ఎన్నికల కమిషనర్‌ టీఎన్‌ శేషన్‌ను ప్రస్తావిస్తూ.. ఆయన చేసినదాంట్లో పదోవంతు కూడా చేయడం లేదని వ్యాఖ్యానించింది. కమిషన్‌ చర్యలు తీసుకోకుంటే.. కోర్టు తీసుకుంటుందని హెచ్చరించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా, ఓటింగ్‌ సందర్భంగా తీసుకున్న జాగ్రత్తలపై శుక్రవారం నాటికి అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

కౌంటింగ్‌ రోజు లాక్‌డౌన్‌!: కేరళ హైకోర్టు
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజైన మే 2న రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది. కౌంటింగ్‌ రోజున అన్ని పార్టీల కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గుమిగూడుతారని, విజయోత్సాహంతో భారీ ర్యాలీలు తీస్తారని, అది కేసుల పెరుగుదలకు కారణమవుతుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రోజుకు రెండు వేల కేసులు ఉంటే.. ఎన్నికల తర్వాత 10వేలకు పెరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

రెమ్‌డెసివిర్‌పై ఒకే విధానం: గుజరాత్‌ హైకోర్టు
దవాఖానలకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాపై ఏకీకృత విధానాన్ని రూపొందించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరింది. గతంలో జరిగిన విచారణ సందర్భంగా.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాలో ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్లపై ఉన్న రోగులకు తొలి ప్రాధాన్యం, ప్రైవేటు దవాఖానల్లో వెంటిలేటర్లపై ఉన్నవారికి రెండో ప్రాధాన్యం, రాష్ట్రంలో వేర్వేరు హాస్పిటళ్లలో ఐసీయూలో ఉన్నవారిని మూడో ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ దవాఖానలో ఉన్నా, ప్రైవేటు హాస్పిటల్‌లో ఉన్నా.. వెంటిలేటర్‌పై ఉన్న రోగులను ఒకే దృష్టితో చూడాలని పేర్కొన్నది.

ఇంకా మేల్కొనరేంటి?: ఢిల్లీ హైకోర్టు
ఆక్సిజన్‌ కొరత సమస్యపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీ హైకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. ఏది చేసైనా దవాఖానలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. ‘వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం ఇంతలా ఎందుకు విస్మరిస్తున్నది? ఆక్సిజన్‌ కొరతతో ప్రజలు చనిపోవడమేంటి? మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి.. జనం చనిపోతుంటారు. మనుషుల ప్రాణాలు మీకు ముఖ్యం కానట్టు ఉన్నది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంతటి అత్యవసర పరిస్థితిలోనూ కేంద్రం ఇంకా ఎందుకు మేల్కొనడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది. దవాఖానలకు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేస్తే పరిస్థితి భయానకంగా మారుతుందని పేర్కొన్నది.

గందరగోళం తగదు
‘దేశంలో పరిస్థితి మెడికల్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్నది. ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచడంపై కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రణాళిక రూపొందించాలి. లాక్‌డౌన్‌పై నిర్ణయాధికారం రాష్ర్టాలకే ఉండాలని, కోర్టు పరిధిలో ఉండరాదని కోరుకుంటున్నాం. లాక్‌డౌన్‌ విధించేందుకు హైకోర్టులకు ఉన్న న్యాయపరిధిపై పరిశీలన జరుపాలని భావిస్తున్నాం. ఢిల్లీ, బొంబాయి, సిక్కిం, మధ్యప్రదేశ్‌, కలకత్తా, అలహాబాద్‌ హైకోర్టులు కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన వివిధ అంశాలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్నాయి.. ఒక హైకోర్టు ఒకరికి ప్రాధాన్యం ఇస్తుంటే.. మరో కోర్టు మరొకరిని ప్రాధాన్య గ్రూపుగా పరిగణిస్తున్నది. ఇది గందరగోళానికి తావిస్తున్నది. ఆక్సిజన్‌ సరఫరా, అత్యవసర ఔషధాల సరఫరా, వ్యాక్సినేషన్‌ తీరుతెన్నులు, లాక్‌డౌన్‌పై మేం వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం.’
-సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం

Advertisement
ఇది నేషనల్‌ ఎమర్జెన్సీ
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement