FSSAI : ఆహార పదార్థాల ప్యాకింగ్, పంపిణీ లేదా నిలువ కోసం వార్తాపత్రికలను వినియోగించవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) మరోసారి స్పష్టంచేసింది. వీధి వ్యాపారులు (Street venders), రెస్టారెంట్లు (Restaurants), క్లౌడ్ కిచెన్లు సహా అన్ని రకాల ఆహార విక్రయ సంస్థలు ఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. వార్తాపత్రికల వాడకంవల్ల తీవ్రమైన ఆరోగ్య ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో సీసం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు, ఇతర రసాయనాలు ఉంటాయని FSSAI వివరించింది.
వేడిగా ఉండే ఆహారపదార్థాలు, నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడ వంటి పదార్థాలను పేపర్లలో చుట్టినప్పుడు, ఆ రసాయనాలు సులభంగా ఆహార పదార్థాల్లోకి చేరుతాయి. ఇలాంటి కలుషిత ఆహారాన్ని తీసుకోవడంవల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు సంభవించడంతోపాటు మూత్రపిండాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని FSSAI హెచ్చరించింది. ఇటీవల ముంబైలోని ఓ ప్రముఖ వడపావ్ విక్రయదారుడు వార్తాపత్రికలను వినియోగిస్తున్నట్లు FSSAI, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) జరిపిన సంయుక్త తనిఖీల్లో వెల్లడైంది.
ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో 2016, 2023 సంవత్సరాల్లోనూ FSSAI ఇటువంటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల నుంచి అదనపు నూనెను తొలగించేందుకు కూడా వార్తాపత్రికలను ఉపయోగించరాదని ఈ సందర్భంగా స్పష్టంచేసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్-2018 ప్రకారం.. ఆహార పదార్థాల నిలువ లేదా సరఫరాకు కేవలం ‘ఫుడ్-గ్రేడ్’ మెటీరియల్స్ మాత్రమే వాడాలని FSSAI సూచించింది. ఈ నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో కఠినంగా పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులకు ఆదేశాలు జారీచేసింది.