Dress code| పాట్నా: బీహార్‌లో పాఠశాల ఉపాధ్యాయులకు అక్కడి ప్రభుత్వం డ్రెస్‌కోడ్ ప్రవేశపెట్టింది. జీన్స్, టీషర్ట్స్ ధరించడంపై నిషేధం విధించింది. మహిళా టీచర్లు భారతీయ వస్త్రధారణలో పాఠశాలకు రావాలని సూచించింది. పురుష ఉపాధ్యాయులు గడ్డం పెంచకూడదని, క్లీన్ సేవ్ చేసుకుని రావాలని స్పష్టంచేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయులు తప్పకుండా ఫార్మల్ డ్రెస్ ధరించి రావాలని అందులో స్పష్టంచేశారు.
నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జీన్స్, టీషర్టులు ధరించడం అఫిషియల్ కల్చర్ కాదని, అవి హుందాగా ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమయానికి బడికి రావాలని, బడివేళలు ముగిసేదాకా ఉండాలని సూచించారు. తరగతి గదుల్లో కుర్చీలు వాడొద్దని స్పష్టంచేశారు.