తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
‘సర్'లో 97.3 లక్షల ఓట్లు డిలీట్.. గత ఎన్నికల్లో డీఎంకే గెలిచిన స్థానాల్లోనే ఓట్ల తొలగింపు ఎక్కువ.. 20-80 వేల ఓట్లు తొలగించిన సీట్లలో ఏకంగా 84 స్థానాలను.. గెలుచుకొన్న విజయ్ పార్టీ.. కొంచెంలో డీఎంకే చేజారిన 50 సీట్లు
- ‘సర్’ ప్రక్రియను తొలుత పట్టించుకోని స్టాలిన్ సేన
- తృణమూల్ కాంగ్రెస్ అనుకూల ఓట్లు పోవడంతో బెంగాల్లో కుప్పకూలిన మమతా బెనర్జీ కంచుకోట
హైదరాబాద్, అక్టోబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ‘సర్’లో భారీగా ఓట్లు తొలగించడం వల్లే తమ పార్టీలు ఓడిపోయాయని అటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, ఇటు బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తమిళనాడులో చేపట్టిన ‘సర్’లో భారీగా ఓట్ల తొలగింపు జరిగిన చోట్ల డీఎంకే స్థానాలు తగ్గుతూ.. ఇదే సమయంలో సీఎం విజయ్ పార్టీ ‘టీవీకే’కు అంతకంతకూ సీట్లు పెరుగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. ఈ మేరకు జాతీయ పత్రిక ‘బిజినెస్‌లైన్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
‘సర్’తో రికార్డ్ పోలింగ్
తమిళనాడులో ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 85.1 శాతం ఓటింగ్ నమోదైంది. 2021 ఎన్నికల్లో నమోదైన 73.6 శాతం ఓటింగ్‌తో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. దీనికి ప్రధాన కారణం 2025 చివరిలో ఆ రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ‘సర్’ ప్రక్రియేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరణించినవారు, నకిలీలు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారితో కలిపి తమిళనాడు ‘సర్’ ప్రక్రియలో సుమారు 97.3 లక్షల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురయ్యాయని, దీంతో ఓటర్ల సంఖ్య 6.7 కోట్ల నుంచి 5.73 కోట్లకు తగ్గినట్టు గుర్తుచేస్తున్నారు. ఓటర్ల సంఖ్య తగ్గడంతో సహజంగానే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది.
డీఎంకే స్థానాల్లోనే తొలగింపు ఎక్కువ
2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలను గెలుచుకోగా, అన్నాడీఎంకే 66 చోట్ల విజయం సాధించింది. మిగతా 35 చోట్ల ఇతరులు గెలిచారు. అయితే, డీఎంకే గెలిచిన 133 స్థానాల్లో ‘సర్’ ప్రక్రియ ద్వారా ఈసీ ఇటీవల చేపట్టిన ఓట్ల తొలగింపులు సగటున 31,454గా ఉన్నట్టు ‘బిజినెస్‌లైన్’ వెల్లడించింది. ఇదే సమయంలో అన్నాడీఎంకే గెలిచిన 66 నియోజకవర్గాల్లో ‘సర్’ ఓట్ల తొలగింపులు సగటు 26,953గా ఉన్నట్టు తేలింది. మిగతా పార్టీలు గెలిచిన చోట ఇవే తొలగింపులు 23,114గా రికార్డయ్యింది. దీన్నిబట్టి గతంలో డీఎంకే గెలిచిన నియోజకవర్గాల్లో సగటున ‘సర్’ ఓట్ల తొలగింపులు ఎక్కువగా ఉన్నట్టు అర్థమవుతున్నది.
గండికొట్టిన భారీ ఓట్ల తొలగింపులు
తమిళనాడులో ‘సర్’ పేరిట 97.3 లక్షల ఓట్లను తొలగించారు. ఇది స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే విజయావకాశాలకు ప్రధానంగా గండి కొట్టినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘బిజినెస్‌లైన్’ కథనం ప్రకారం.. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాల్లో 10 వేల వరకూ ఓట్ల తొలగింపు జరగ్గా, ఇందులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే 7 సీట్లను, అన్నాడీఎంకే 6 సీట్లను, టీవీకే రెండు సీట్లను గెలుచుకోగా మిగతా నాలుగు చోట్ల ఇతరులు గెలిచారు. ఇక, 80 నియోజకవర్గాల్లో 10 వేల నుంచి 20 వేల మేర ఓట్లు తొలగించగా, ఇందులో డీఎంకే 20, అన్నాడీఎంకే 24 స్థానాలను గెలుచుకోగా టీవీకే 22 సీట్లలో విజయం సాధించింది.
మిగతా 14 చోట్ల ఇతరులు గెలిచారు. 66 నియోజకవర్గాల్లో 20 వేల నుంచి 30 వేల మేర ఓట్లు తొలగిస్తే, డీఎంకే 21 సీట్లు, అన్నాడీఎంకే 11 సీట్లు, ఇతరులు రెండు స్థానాలను గెలుచుకోగా, టీవీకే మాత్రం 32 సీట్లలో విజయం సాధించింది. 37 నియోజకవర్గాల్లో 30 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు తొలగిస్తే, డీఎంకే 8, అన్నాడీఎంకే 5 స్థానాలకు పరిమితం కాగా టీవీకే మాత్రం 24 చోట్ల గెలిచింది.
ఇక, 22 నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 80 వేల మేర ఓట్ల తొలగింపులు జరిగితే, డీఎంకే 3 సీట్లు, అన్నాడీఎంకే ఒక స్థానంలో గెలిస్తే, టీవీకే 18 స్థానాలను కైవసం చేసుకున్నది. అన్నింటికీ మించి.. 80 వేల పైచిలుకు ఓట్లను తొలగించిన 10 నియోజకవర్గాల్లో మొత్తం అన్నింటినీ టీవీకేనే గెలుచుకోవడం గమనార్హం. దీన్నిబట్టి, ఓట్ల తొలగింపులు పెరిగిన చోట డీఎంకే దెబ్బతినగా, టీవీకే లబ్ధి పొందినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంత్రులూ ఓడారు
‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమిళనాడులో డీఎంకే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో 133 సీట్లను గెలుచుకొన్న స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఇటీవలి ఎన్నికల్లో 59 స్థానాలకు పరిమితమైంది. గత స్టాలిన్ ప్రభుత్వ మంత్రివర్గంలోని 32 మంది మంత్రుల్లో 15 మంది ఓడిపోవడానికి ‘సర్’లో తొలగించిన 5-10 వేల ఓట్లే కారణమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాదు, ఉత్తర తమిళనాడులోని 69 స్థానాల్లో 30కి పైగా స్థానాలు, పశ్చిమ తమిళనాడులోని 20కి పైగా స్థానాలను 10 వేలలోపు ఓట్ల తేడాతో డీఎంకే చేజార్చుకొన్నట్టు గుర్తుచేస్తున్నారు. ‘సర్’ ప్రక్రియపై అప్రమత్తంగా ఉంటే, డీఎంకే సులభంగా అధికారంలోకి వచ్చేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బెంగాల్లో మమత పార్టీకి ‘సర్’ సెగ
బెంగాల్లో మమత కంచుకోట బీటలువారడానికి ‘సర్’లో భారీగా టీఎంసీ అనుకూల ఓట్లను తొలగించడమే కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది ఓట్ల తేడాతో టీఎంసీ భారీగా సిట్టింగ్ స్థానాలను కోల్పోవడాన్ని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. బెంగాల్లో అత్యధికంగా ముర్షీదాబాద్ జిల్లాలో 4.55 లక్షల మంది ఓటర్లను ‘సర్’ ప్రక్రియలో భాగంగా తొలగించారు. 2021 ఎన్నికల్లో ఆ జిల్లాలో ఉన్న 22 సీట్లలో 20 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించగా ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మైనారిటీ ఓట్లను భారీగా తొలగించడమే దీనికి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక, ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 3.25 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇటీవల జాబితా నుంచి తొలగించారు.
గతంలో ఈ జిల్లాలోని మొత్తం 33 స్థానాల్లో 28 సీట్లను గెలిచిన టీఎంసీ.. ఈసారి కేవలం 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. మాల్దా జిల్లాలో 2.39 లక్షల ఓట్లను తొలగించగా.. అక్కడ గతంలో టీఎంసీ 8 స్థానాలను గెలుచుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. టీఎంసీ చేజార్చుకొన్న ఈ అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ‘సర్’ ప్రక్రియలో భాగంగా భారీగా ఓటర్లను తొలగించడమే టీఎంసీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బెంగాల్ ‘సర్’లో తొలగించిన ఓట్ల శాతం 11.88 శాతంగా ఉండగా.. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 5.04 శాతంగా ఉండటం గమనార్హం.
‘సర్’ ఓట్ల తొలగింపులు (సీట్లు) ఏ పార్టీకి ఎన్ని సీట్లు

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bypolls
- DMK Stalin
- sir
- Tamil Nadu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

