Gas Price : వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ (Gas) ను వినియోగించే వారికి చమురు కంపెనీలు (Oil Companies) ఊరట కల్పించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder price) ధరను భారీగా తగ్గించాయి. ఈ ఏడాది వాణిజ్య సిలిండర్ (Commercial Cylinder) ధర తగ్గడం ఇదే మొదటిసారి. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్‌పై రూ.183.50 మేర ధర తగ్గింది. దాంతో అక్కడ సిలిండర్ ధర రూ.3,113.50 నుంచి రూ.2,930 కి చేరింది.
కోల్‌కతాలో రూ.174 తగ్గడంతో ధర రూ.3,081.50కి, చండీగఢ్‌లో రూ.181.50 తగ్గింపుతో రూ.2,954.50కి, పట్నాలో రూ.173 తగ్గింపుతో రూ.3,227కి ధరలు దిగివచ్చాయి. అదేవిధంగా హైదరాబాద్‌లో రూ.176 తగ్గి సిలిండర్ ధర రూ.3,191కి చేరింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడమే ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని 60 రోజులపాటు పొడిగించడంతో చమురు ధరలు దిగివచ్చాయి.
దాంతోపాటు ప్రపంచంలోని 20 శాతం చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఒత్తిడి తగ్గింది. అయితే, గృహ వినియోగదారులకు మాత్రం ఈసారి కూడా ఎలాంటి శుభవార్త అందలేదు. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.942, కోల్‌కతాలో రూ.968, ముంబైలో రూ.941.50, చెన్నైలో రూ.957.50, హైదరాబాద్‌లో రూ.994 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.