Unemployment | న్యూఢిల్లీ, జనవరి 10: దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ అధికమవుతున్నది. ముఖ్యంగా 20 నుంచి 34 ఏండ్ల యువతలో నిరుద్యోగ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. నిరుడు జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ-2) చివరి నాటికి 20 నుంచి 24 ఏండ్ల యువతలో 43.65 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ-3)లో 44.49 శాతానికి పెరిగినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఈ రేటు 25-29 ఏండ్ల యువతలో 13.35 శాతం నుంచి 14.33 శాతానికి పెరిగి మూడున్నర ఏండ్ల గరిష్ఠ స్థాయిని తాకినట్టు, 30-34 ఏండ్ల యువతలో 2.06 శాతం నుంచి 2.49 శాతానికి చేరినట్టు స్పష్టం చేశాయి. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా పెరగడమే ఇందుకు కారణమని సీఎంఐఈ పేర్కొన్నది.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 20-24 ఏండ్ల యువతలో 43.79 శాతానికి, 25-29 ఏండ్ల యువతలో 13.06 శాతానికి, 30-34 ఏండ్ల యువతలో 2.24 శాతానికి పెరిగినట్టు తెలిపింది. దీనికి భిన్నంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మెరుగుపడినట్టు వెల్లడించింది. ముఖ్యంగా 20-24 ఏండ్ల యువతలో ఈ రేటు 47.61 శాతం నుంచి 45.98 శాతానికి, 30-34 ఏండ్ల యువతలో 3.29 శాతం నుంచి 3.04 శాతానికి తగ్గిందని, 25-29 ఏండ్ల యువతలో మాత్రం ఈ రేటు 15.61 శాతం నుంచి 16.54 శాతానికి పెరిగిందని వివరించింది.