Manohar Lal Khattar | చండీగఢ్, సెప్టెంబర్ 7: తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరిన ఓ పేద మహిళను హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ దారుణంగా అవమానించారు. ‘చంద్రయాన్-4తో నిన్ను కూడా పంపుతా.. కూర్చో’ అంటూ సదరు మహిళను ఉద్దేశించి వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం ఖట్టర్ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ‘ఉపాధి చూపమని సదరు మహిళ సీఎంను కోరటం నేరమా? సీఎం ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజా సేవచేయడానికి ఎన్నుకోబడ్డ నాయకులు.. ప్రజలపైనే పరిహాసమాడుతున్నారు’ అంటూ ఆప్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
‘ఇదే విధమైన డిమాండ్ ప్రధాని మోదీకి మిత్రులైన బడా కోటీశ్వరులు, కార్పొరేట్ల నుంచి వస్తే.. అప్పుడు మొత్తం హర్యానా ప్రభుత్వ యంత్రాంగమే వారి సేవలో నిమగ్నమయ్యేది’ అని ఆప్ ఎద్దేవా చేసింది. ‘పేద మహిళ తన కష్టం చెప్పుకుంటే సీఎం ఖట్టర్‌కు నవ్వులాటగా ఉంది’ అని కాంగ్రెస్ మండిపడింది. మహిళల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.