చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఆయన పరాజయాన్ని చవిచూశారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ పోటీ చేశారు. 1996 తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇక టీవీకే చీఫ్ విజయ్.. పెరంబూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజా సమాచారం ప్రకారం టీవీకే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఈసీ వెబ్సైట్ ప్రకారం 108 స్థానాల్లో టీవీకే, 59 స్థానాల్లో డీఎంకే, 44 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులు లీడింగ్‌లో ఉన్నారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
తమిళనాడు ఉత్తర జిల్లాలో టీవీకే అద్భుత ప్రదర్శన ఇచ్చింది. చెన్నై, చంగల్పట్టు, కంచీపురం, తిరువల్లూరులో విజయ కేతనం ఎగురవేసింది.వాస్తవానికి ఈ ప్రాంతాల్లో ద్రావిడ్ పార్టీల ఆధిపత్యం ఉండేది. సెంట్రల్ తమిళనాడులోనూ టీవీకే మంచి పోటీ ఇచ్చింది. తిరుచిరాపల్లి, తాంజావురు, కరూర్, పెరంబలూరు, అరియాలూరు, నాగపట్టణం, తిరువరూరు, పుడుకొట్టై, మలదుతరై జిల్లాలో టీవీకే మేటి ప్రదర్శన ఇచ్చింది.