Road cave : తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లో ఇవాళ (గురువారం) ఉదయం ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టైడల్ పార్క్ సమీపంలోని తిరువాన్మియూర్ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దాంతో రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా ఏర్పడిన ఆ భారీ గోతిలో పడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు. ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
టైడల్ పార్కు సమీపంలో మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతున్న మార్గంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో సుమారు 10 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. డ్రైవర్ స్పందించేలోపే కారు అదుపుతప్పి ఆ గొయ్యిలో తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతంలో 2025 మే నెలలో కూడా తిరువాన్మియూర్ జంక్షన్ సమీపంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పాత డ్రైనేజీ పైప్లైన్ విఫలం కావడంతో అప్పుడు ఆరు అడుగుల గొయ్యి ఏర్పడి ఓ కారు అందులో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం మెట్రో సిబ్బంది రోడ్డు కుంగిన ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేస్తున్నారు.