చండీగఢ్ : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆఫీసులో మంగళవారం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చండీగఢ్‌తో పాటు పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న తన ఆఫీసులు, ఇండ్లతో పాటు ఓఎస్డీ రాజ్బీర్ సింగ్ ఘమన్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారని సీఎం మాన్ ఎక్స్ వేదికగా తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే బీజేపీ ఇలా చేస్తున్నదని, ఇకపై తనమీద బురద జల్లడానికి అనేక రకాల కుట్రలు చేస్తారని ఆరోపించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఇలా ప్లాన్ చేస్తున్నదన్నారు. అయితే సీబీఐ మాత్రం కోర్టు ఆదేశాలతోనే సోదాలు నిర్వహించామని వెల్లడించింది.
ప్రభుత్వంలో బదిలీలు, పోస్టింగులు, ఇతర వ్యవహారాల్లో ఓఎస్డీ రాజ్బీర్ సింగ్‌తో పాటు నితిన్ గోహల్, బీర్ దేవిందర్తో పాటు మరికొందరు జోక్యం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తూ ఆ రాష్ట్ర డీజీపీకి మూడు లేఖలు రాసింది. అయితే ఆ లేఖలపై పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందిస్తూ.. సీబీఐ క్రిమినల్ కేసులు నమోదు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని అక్టోబర్ 5న ఆదేశించింది.