న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన ర్యాలీలో బిజూ జనతాదళ్(బీజేడీ) పాల్గొంది. పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఆదేశాలతో రాజ్యసభ ఎంపీలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ ప్రదర్శనలో భాగస్వాములయ్యారు.
ఎస్ఐఆర్ పేరుతో ఒడిశాలో 20 లక్షలకు పైగా, దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని బీజేడీ నేతలు ఆరోపించారు. తాము అధికారికంగా ఇండియా కూటమిలో చేరలేదని స్పష్టం చేసినప్పటికీ, బీజేపీని వీడి, విపక్షాలతో గళం కలపడం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఎదురైన పరాభవమే బీజేడీ రాజకీయ వైఖరిలో మార్పునకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.