Bajrang Lal Bagra : అయోధ్య రామమందిరం (Ayodhya Ram Temple) లో భక్తుల విరాళాల చోరీపై దర్యాప్తు కొనసాగుతున్న వేళ శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Ram JanmaBhumi TheerthaKshetra Trust) కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ (Champath Roy) రాజీనామాను సోమవారం ఆమోదించింది. ఆయన స్థానంలో బజరంగ్ లాల్ బగ్రా (Bajrang Lal Bagra) కు బాధ్యతలు అప్పగించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. దేవాలయ విరాళాల్లో అవినీతి కేసులో దర్యాప్తు వేగం పుంజుకున్న నేపథ్యంలో జూన్ 26న చంపత్‌రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
అంతకుముందు ఆయన డ్రైవర్ రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూతోపాటు మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పటివరకు చంపత్‌రాయ్ లేదా అనిల్ మిశ్రాపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదు. రామమందిర ప్రాంగణంలో సోమవారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చంపత్‌రాయ్ ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పటికీ సమావేశానికి హాజరు కాలేదని సమాచారం. 2020లో ట్రస్ట్ ఏర్పడిన తర్వాత ఇది అత్యంత కీలక సమావేశంగా భావిస్తున్నారు.
ట్రస్ట్ ట్రెజరరీ స్వామి గోవింద్ దేవ్ గిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ హాజరయ్యారు. సమావేశంలో విరాళాల దుర్వినియోగంపై సిట్ మధ్యంతర నివేదిక, ఆలయ భవిష్యత్ పాలనా విధానం, సీఈఓ నియామకం, 2025-26 ఆర్థిక లెక్కల ఆమోదం వంటి అంశాలపై చర్చించారు. ఇక విరాళాల దుర్వినియోగంపై సిట్, పోలీసులు సమాంతరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్‌రావు వాంగ్మూలాలు నమోదు చేసినప్పటికీ, వారిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.
బజరంగ్ బాగ్రా రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన వారు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) లో ఛైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) గా ఆయన పనిచేశారు. అంతకుముందు నాల్కో, రైట్స్ లిమిటెడ్‌లో డైరెక్టర్ (ఫైనాన్స్), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) బాధ్యతలు నిర్వహించారు. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) లో పూర్తికాల కార్యకర్తగా చేరి, ప్రస్తుతం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆర్థిక నిర్వహణ, సంస్థాగత పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆయనను కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది.