న్యూఢిల్లీ: భగేశ్వర్ ధామ్(Bageshwar Dham) పీఠాధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చిక్కుల్లో పడ్డారు. ఓ మతం ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యలను పంజాబ్ షాహీ ఇమామ్ మౌలానా మొహమ్మద్ ఉస్మాన్ రెహ్మాని లుథ్వియాన్వి ఖండించారు.మత మనోభావాలను ఆయన అగౌరవపరిచారని, ఆధ్యాత్మిక గురువు క్షమాపణలు చెప్పాలని షాహి ఇమామి డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకుంటే, ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు.
లుథియానాకు మిమ్ముల్ని ఆహ్వానిస్తున్నామని, కానీ ఇక్కడ ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టడం సరికాదు అని ఇమామ్ అన్నారు. లుథియానా ప్రజలు ఒకర్ని ఒకరు గౌరవించుకుంటారని చెప్పారు. విద్వేషాలతో శాంతిని చెడగొట్టవద్దు అన్నారు. ధీరేంద్ర శాస్త్రి చైనా గురించి వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ ఆ వ్యాఖ్యలను చేసింది చైనా తయారీ మైకులతో అని చెప్పారు. ముస్లింలు మాత్రమే కాదు, క్రైస్తవులు కూడా ధీరేంద్ర వ్యాఖ్యలను ఖండించినట్లు తెలిపారు.
తానేమీ మతాలకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని ధీరేంద్ర అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ కానీ, మతమార్పుడులు కానీ ఉండకూడదని ఆయన అన్నారు. హిందువులు, సిక్కులు తప్పకుండా ఆలయాలు, గురుద్వారాలను విజిట్ చేయాలని, మరో చోటుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ధీరేంద్ర అన్నారు.