న్యూఢిల్లీ: యాపిల్ సంస్థ ఇటీవల 16 ప్రో మ్యాక్స్ ఫోన్ల(iPhone 16 Pro Max)ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి సుమారు 26 ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తన చేతి బ్యాగులో ఆ మహిళ ఫోన్లను దాచినట్లు గుర్తించారు. టిష్యూ పేపర్లలో పెట్టి మరీ వాటిని ఆమె తీసుకెళ్తోంది. ఐఫోన్ 16 సిరీస్లో.. ప్రో మ్యాక్స్ టాప్ మోడల్. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. ఈ కేసులో మరింత విచారణ చేపడుతున్నారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుంది.