Anantnag Encounter | దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా కోకెర్నాగ్లో నాలుగో రోజు ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కోకెర్నాగ్లోని దట్టమైన అడవులు, పర్వతాల మధ్య పోలీసులు, భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఉత్తర ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం అనంతనాగ్ చేరుకున్నారు. కోకెర్నాగ్ ఎన్‌కౌంటర్‌పై అధికారులు సమాచారం ఇచ్చారు. ఉత్తర ఆర్మీ కమాండర్ అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అనంతనాగ్‌లోని కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఆపరేషన్ స్థితిని సమీక్షించారని ఆర్మీ ఉత్తర కమాండ్ ట్విట్టర్లో ఓ పోస్ట్‌లో తెలిపింది.
ఆపరేషన్ నాలుగో రోజుకు చేరుకుంది. ఇక్కడ చాలా సహజసిద్ధమైన గుహలు ఉన్నాయి. వీటిలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, ఇతర ఆధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఇక్కడ అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. డ్రోన్ దాడులకు సంబంధించిన వీడియోను సైతం బయటపడింది. ఈ వీడియోలో కాల్పులు జరుగుతుండగా ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. హెలికాప్టర్లు, ఇతర ఆధునిక పరికరాలను ఆర్మీ వినియోగిస్తున్నది.