న్యూఢిల్లీ: అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌ల పర్వం మొదలైంది. మంగళవారం కంపెనీలోని పలు విభాగాలలో కొత్త విడత ఉద్యోగ కోతలు జరిగినట్టు అమెజాన్ ఉద్యోగులు వెల్లడించారు. తమకు ఈమెయిల్స్ అందినట్టు ఉద్యోగుల బృందం ఒకటి అంతర్గత స్లాక్ చానల్లో రాసింది. దాదాపు 37,000 మంది సభ్యులున్న ఆ చానెల్‌ను ఉద్యోగ విరమణ పరిహారం, అంతర్గత ఉద్యోగ ప్రకటనలకు అవకాశం, మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయా అనే ప్రశ్నలు ముంచెత్తాయి.
ఉద్యోగుల తగ్గింపు ప్రక్రియలో భాగంగా ఈ తాజా చర్య వల్ల 1,000 మంది వరకు ఉద్యోగులు ప్రభావితమయ్యారని సమాచారం. తాజా ఉద్యోగ తొలగింపులు ప్రధానంగా అమెజాన్ స్టోర్స్ విభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో కంపెనీ ప్రధాన ఆన్లైన్ రిలైల్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అంతర్గత స్లాక్ చానళ్లలో ప్రచారంలో ఉన్న పోస్టుల ప్రకారం అమెరికా, భారత్, బ్రిటన్‌లోని ఉద్యోగులు ప్రభావితమైన వారిలో ఉన్నారని బిజినెస్ ఇన్సైడర్ పేర్కొంది.