AMU Students : ఉత్తర ప్రదేశ్, అలీగఢ్‌లో ఉన్న అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏంఎయూ)లో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఒక విద్యార్థిని ఆస్పత్రికి తరలించేందుకు యూనివర్సిటీ అధికారులు ప్రయత్నించగా.. ఇతర విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఏఎంయూలో ఎనిమిదేళ్లుగా విద్యార్థి సంఘం ఎన్నికలు జరగలేదు. దీంతో ఈసారి విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో కొద్ది రోజులుగా విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు.
వీరిలో యాసర్ ఫహాద్ అనే పీజీ విద్యార్థి కూడా ఉన్నాడు. అతడు ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడిని ఎలాగైనా ఆస్పత్రికి తరలించాలని యూనివర్సిటీ అధికారులు సిద్దమయ్యారు. ఇందుకోసం కొందరు సెక్యూరిటీ సిబ్బందితోపాటు నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. విద్యార్థిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్సు కూడా ఏర్పాటు చేశారు. నిరసన ప్రదేశం నుంచి యాసర్‌ను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. చాలా మంది విద్యార్థులు యాసర్ చుట్టూ రక్షణగా ఉన్నారు.
అతడిని తరలించకుండా అడ్డుకున్నారు. చివరకు ఏమీ చేయలేక.. సెక్యూరిటీ సిబ్బంది, యూనివర్సిటీ అధికారులు వెనుదిరిగారు అని యూనివర్సిటీ బుధవారం వెల్లడించింది. విద్యార్థుల నిరాహార దీక్షను అడ్డుకోవాలని అనేది తమ ఉద్దేశం కాదని, కానీ, దీక్ష చేస్తున్న విద్యార్థికి అత్యవసర వైద్యం అవసరం అని అధికారులు అన్నారు. అందువల్లే అతడిని ఆస్పత్రికి తరలించాలనుకున్నట్లు చెప్పారు. అతడి ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో యాసర్ కొంత కోలుకున్న తర్వాత అతడిని తిరిగి దీక్షాస్థలి వద్దకు తీసుకొస్తామని హామీ కూడా ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
అయినప్పటికీ విద్యార్థులు స్పందించలేదన్నారు. మరోవైపు తమ డిమాండ్లపై విద్యార్థులు స్పందించారు. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తోందని, అందువల్ల వెంటనే విద్యార్థి సంఘం ఎన్నికల నిర్వహణకు డేట్లు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే దీక్ష విరమిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.