Aircraft Door : జైపూర్ (Jaipur) కు చెందిన ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ (IIT Graduate) విమానంలో దుందుడుకుగా వ్యవహరించి చిక్కుల్లోపడ్డాడు. జైపూర్ నుంచి బెంగళూరు (Bengalore) కు బయల్దేరిన విమానం గగనతలంలో ఉండగా.. దాని ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) తీసేందుకు యత్నించాడు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 24 గంటల కూడా గడువకముందే బెంగళూరు పోలీసులపై సోషల్ మీడియా (Social Media) లో అభ్యంతరకర పోస్టులు పెట్టాడు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఉత్కర్ష్ గౌతమ్ మార్చి 22న బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కాడు. అది టేకాఫ్ అయిన కొద్దిసేటికే దాని సేఫ్టీ డోర్ తీసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి అతడిని వెనక్కి లాగేయగా.. వారితో దురుసుగా ప్రవర్తించాడు. దాంతో విమానయాన సంస్థ అతడిని ప్రవర్తన సరిగా లేని ప్రయాణికుల జాబితాలో చేర్చింది. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత సిబ్బంది ఉత్కర్ష్‌ను పోలీసులకు అప్పగించారు.
విచారణ అనంతరం ఉత్కర్ష్ అదేరోజు జైపూర్‌కు వెళ్లిపోయాడు. అయితే అతడు అంతటతో ఆగలేదు. కేవలం 24 గంటల వ్యవధిలోనే బెంగళూరు సిటీ పోలీసులే లక్ష్యంగా అభ్యంతరకర వీడియోలను షేర్ చేశాడు. ఎలాంటి కారణం లేకుండా తనను అరెస్టు చేసి కొట్టారని ఆరోపించాడు. అయితే ఆ ఆరోపణలను బెంగళూరు పోలీసులు ఖండించారు. తమ పరువుకు భంగం కలిగించేలా అతడు చేసిన పోస్టులను సీరియస్‌గా తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.
ఈ వరుస ఘటనలపై ఉత్కర్ష్ కుటుంబసభ్యులు స్పందించారు. అతడు ఐఐటీ చదువు పూర్తి చేసిన తర్వాత ప్రముఖ కంపెనీల్లో పనిచేశాడని తెలిపారు. అయితే ప్రస్తుతం బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, ఆ కారణంగానే ఇప్పుడు ఏ ఉద్యోగం చేయడం లేదని చెప్పారు.