న్యూఢిల్లీ, జనవరి 6: పొరుగున ఉన్న చైనా 1978 నుంచే వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తుంటే మన దేశంలో మాత్రం 1991 నుంచి ఇప్పటివరకు పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) చైర్మన్ వివేక్ దెబ్రాయ్ పేర్కొన్నారు. ఓ అగ్రి సమ్మిట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ… 1991లో భారత్ అమలు చేసిన సంస్కరణలు కేవలం పారిశ్రామిక సరళీకరణకు సంబంధించినవే కానీ వ్యవసాయానికి సంబంధించినవి కావని అన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రంగం లాభసాటిగా లేదని, దేశ జీడీపీలో ఈ రంగం వాటా ఏడాదికి ఒక శాతం చొప్పున తగ్గిపోతున్నదని తెలిపారు. పెట్టుబడి ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల వ్యవసాయం లాభసాటిగా లేదని, ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సమస్యలూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెంచాలని, వాణిజ్యీకరణ, వైవిధ్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టాలంటే ఆధునికీకరించిన భూరికార్డులు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.